గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఏర్పాటు చేయనున్న ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో భాగస్వామిగా చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఆహ్వానించారు. గాజాలో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడం, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ చొరవ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికలో భాగంగా, రెండో దశ అమలుకు సంబంధించినదిగా తెలుస్తోంది.
ప్రపంచ స్థాయిలో భారత్‌కు ఉన్న విశ్వసనీయత, సమతుల్య విదేశాంగ విధానం, శాంతి ప్రయత్నాల్లో దాని పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ ఆహ్వానం ఇచ్చినట్లు సమాచారం. గాజాలో పరిస్థితిని పర్యవేక్షించడం, మానవతా సహాయం, పునర్నిర్మాణం, సంఘర్షణ నివారణకు సంబంధించిన చర్యలను ఈ బోర్డు సమన్వయం చేస్తుంది. అయితే ఈ ప్రతిపాదనపై భారత్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. భారత్ ఈ చొరవలో భాగమైతే, పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియలో తన పాత్ర మరింత బలోపేతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
బోర్డు సభ్యుల వివరాలు
వైట్ హౌస్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సభ్యుల జాబితాను విడుదల చేసింది. గాజాలో శాంతి, స్థిరత్వం, పునర్నిర్మాణం, దీర్ఘకాలిక అభివృద్ధిని పర్యవేక్షించనున్న ఈ బోర్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
ఈ బోర్డులోని ప్రముఖ సభ్యులు:
* అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
* బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్
* ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్
* ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా
* ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్
* అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ సీఈఓ మార్క్ రోవాన్
* అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ గాబ్రియేల్
* తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్
* ఖతారీ దౌత్యవేత్త అలీ అల్ తవాడి
సభ్యత్వ రుసుముపై స్పష్టీకరణ
గాజా శాంతి బోర్డులో చేరేందుకు దేశాలు ఒక బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్న మీడియా కథనాలను వైట్ హౌస్ ఖండించింది. బోర్డులో చేరేందుకు ఎలాంటి కనీస రుసుము నిర్ణయించలేదని స్పష్టం చేసింది. శాంతి, భద్రత, శ్రేయస్సు పట్ల లోతైన నిబద్ధత చూపే భాగస్వామ్య దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని వైట్ హౌస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.


