ఇరాన్‌పై టారిఫ్‌ కొరడా! | Trump Imposes 25 percent Tariff on Iran Trade | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై టారిఫ్‌ కొరడా!

Jan 14 2026 1:42 AM | Updated on Jan 14 2026 1:42 AM

Trump Imposes 25 percent Tariff on Iran Trade

ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం పన్ను

అగ్రరాజ్యం మరో సంచలన నిర్ణయం

భారత్‌కు గట్టి షాక్‌

ఇప్పటికే 50 శాతం సుంకాలతో సతమతమవుతున్న భారత్‌

సాక్షి, న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణిచేస్తున్న ఖమేనీ సారథ్యంలోని ఇరాన్‌ ప్రభుత్వంపై అమెరికా దాడులతో సమాధానం చెబుతుందని అంతా భావిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్యంగా టారిఫ్‌ల కొరడా ఝుళిపించారు. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగం, నిరసనలతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఇరాన్‌ను మరింతగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేలా, వాణిజ్యరంగంలో ఇరాన్‌ను ఏకాకిని చేసేలా ట్రంప్‌ పథక రచన చేశారు.

ఇందులోభాగంగా ఇకపై ఇరాన్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగించే ప్రతి దేశంపై తాము 25 శాతం అదనపు టారిఫ్‌లను విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘మాతో వ్యాపారం చేసే దేశాలు ఒకవేళ ఇరాన్‌తోనూ వ్యాపార, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తే ఆ దేశాలపై అదనంగా 25 శాతం టారిఫ్‌ విధిస్తాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇదే తుది నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు’ అని ట్రంప్‌ తేల్చిచెప్పారు.

భారత్‌పై పడనున్న పెను ప్రభావం 
ట్రంప్‌ తాజా నిర్ణయం భారత్‌ను ఇరకాటంలో పడేసింది. ఇరాన్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వాముల్లో భారత్‌ ఒకటి. చైనా, తుర్కియే, యూఏఈ, పాకిస్థాన్‌లతో పాటు భారత్‌ కూడా ఇరాన్‌తో విస్తృతమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికే ఆంక్షల వలయంలో ఉన్న భారత్‌పై రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు జరుపుతున్నందుకుగాను, అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్‌ విధించింది. ఇప్పుడు ఇరాన్‌తో సంబంధాల కారణంగా అదనంగా మరో 25 శాతం భారం పడనుంది. దీంతో అధిక టారిఫ్‌లకు భయపడి ప్రపంచదేశాలు ఇరాన్‌తో వాణిజ్యాన్ని పూర్తిగా తగ్గించుకుంటాయి.

అంతర్జాతీయ వాణిజ్యం కునారిల్లడంతో విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో ఇరాన్‌ చివరకు ఏకాకిగా మారుతుందని, అప్పుడు తాను చెప్పిన మాట ఇరాన్‌ వింటుందని అమెరికా భావిస్తోంది. అయితే అధిక టారిఫ్‌ కారణంగా ఇకపై ఇరాన్‌తో భారత వాణిజ్య పరిమాణం భారీగా తగ్గే ప్రమాదముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. భారత్‌–అమెరికా వాణిజ్య బంధంపైనా తీవ్ర ఒత్తిడి పెరిగే వీలుంది. 

ఇరాన్‌తో భారత్‌ వేల కోట్ల వాణిజ్యం
ఇరాన్‌తో భారత్‌ వాణిజ్య బంధం కేవలం వ్యూహాత్మకమే కాదు, ఆర్థికంగానూ కీలకమైనది. 2023లో భారత్‌ నుంచి ఇరాన్‌కు దాదాపు 1.19 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 10,740 కోట్లు) ఎగుమతులు జరిగాయి. ఇందులో సింహభాగం బాస్మతి బియ్యానిదే. ఏటా దాదాపు రూ.6,623 కోట్ల విలువైన బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అవుతోంది. తేయాకు, పంచదార, ఔషధాలు, సోయాబీన్‌ సైతం ఇరాన్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు అమెరికా ఆంక్షల భయంతో ఈ ఎగుమతులు నిలిచిపోతే, దేశీయ మార్కెట్‌లో ఈ పంటల ధరలు పడిపోయి అన్నదాతలు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

అలాగే ఇరాన్‌ నుంచి భారత్‌ దిగుమతి చేసుకునే డ్రైఫ్రూట్స్, రసాయనాల ధరలు భగ్గుమనే అవకాశం లేకపోలేదు. ఇరాన్‌ నుంచి భారత్‌ 1.02 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 9,205 కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇందులో డ్రైఫ్రూట్స్‌ (ఎండు ద్రాక్ష, అంజీర్‌), రసాయనాలు, గాజు పాత్రలు ఉన్నాయి. డీజీసీఐఎస్‌ 2025 గణాంకాల ప్రకారం ధాన్యాల ఎగుమతి 64.9 కోట్ల డాలర్లుగా ఉండగా, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు 7.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కృత్రిమ నారలు, ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, కృత్రిమ ఆభరణాల వంటివీ  ఇరాన్‌కు ఎగుమతి అవుతున్నాయి.

అగమ్యగోచరంగా  ‘చాబహార్‌’ భవిష్యత్తు
భారత్‌–ఇరాన్‌ సంబంధాల్లో చాబహార్‌ పోర్ట్‌ అత్యంత కీలకమైనది. పాకిస్థాన్‌ను పక్కనపెట్టి మధ్య ఆసియాకు చేరేందుకు భారత్‌ దీనిని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. 2024 మే నెలలో ఇండియా పోర్ట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ చాబహార్‌లోని షాహిద్‌ బెహెష్తీ టెర్మినల్‌ నిర్వహణ కోసం ఇరాన్‌తో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం భారత్‌ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ట్రంప్‌ నిర్ణయంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఓడరేవు అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షల కత్తి వేలాడే అవకాశం ఉంది.

భారత్‌–ఇరాన్‌ మధ్య శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక బంధం ఉంది. ఒకవైపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికా.. మరోవైపు వ్యూహాత్మక మిత్రదేశమైన ఇరాన్‌. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం ఇప్పుడు భారత్‌కు పెద్ద సమస్యగా తయారైంది. డాలర్‌ ఆధిపత్యం లేకుండా రూపాయి మారకంలో వాణిజ్యం చేయడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, అమెరికా మార్కెట్‌ను వదులుకునే సాహసం భారత్‌ చేయలేకపోవచ్చు. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి దౌత్యపరమైన మంత్రం ప్రయోగిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement