వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇరాన్‌పై మరో విడత దాడులకు దిగాలని ఆయన ఆలోచిస్తున్నారని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కీలక పరిణామంపై చర్చించేందుకు ట్రంప్ ఇప్పటికే తన ఉన్నత స్థాయి భద్రతా బృందంతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
చర్చల విఫలం.. పెరుగుతున్న ఒత్తిడి
శాంతి చర్చల కోసం ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదని వాషింగ్టన్ వర్గాలు పేర్కొంటున్నాయి. చర్చలు ‘యాతనాభరితంగా’ సాగుతున్నాయని, ప్రతిరోజూ ముసాయిదాలు మారుతున్నా, ఒప్పందం కుదిరే సంకేతాలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండటం అమెరికాకు ఆమోదయోగ్యం కాదని, అవసరమైతే కఠిన చర్యలు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం కుదరని పక్షంలో, యుద్ధాన్ని ముగించేందుకు ఒకే ఒక్క ‘నిర్ణయాత్మక’ భారీ సైనిక ఆపరేషన్ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వ యత్నాలు
మరోవైపు, యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ సైనిక ప్రధానాధికారి అసిమ్ మునీర్ రంగంలోకి దిగారు. ఆయన టెహ్రాన్‌లో పర్యటిస్తూ, ఇరాన్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఖతార్ ప్రతినిధులు కూడా ఈ శాంతి ప్రయత్నాల్లో భాగస్వాములవుతున్నారు. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య విభేదాలు ఇంకా సడలిపోతేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది. పాకిస్థాన్ ఒక అధికారిక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఏ మేరకు ఫలితాన్నిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
వాషింగ్టన్‌లోనే ట్రంప్.. మారుతున్న వ్యూహాలు
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ తన వ్యక్తిగత పర్యటనలను కూడా రద్దు చేసుకున్నారు. కుమారుడి వివాహం వంటి కీలక వ్యక్తిగత కార్యక్రమాలను పక్కన పెట్టి, తాను వైట్ హౌస్‌లోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నానని ఆయన ప్రకటించారు. మంగళవారం నాటి వరకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలనే ధోరణిలో ఉన్న ట్రంప్, గురువారం రాత్రి నాటికి దాడుల వైపు మొగ్గు చూపడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. రాబోయే గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి.
ఇది కూడా చదవండి: ‘జెన్ జెడ్’ మంత్రం.. ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ధ్యానం


