దక్షిణాఫ్రికా దక్కేదెవరికో? | Sakshi
Sakshi News home page

South Africa election 2024: దక్షిణాఫ్రికా దక్కేదెవరికో?

Published Tue, May 28 2024 5:16 AM

South Africa election 2024: South Africans go to the polls to choose a new government

రేపే పార్లమెంటు ఎన్నికలు  

వరుసగా ఏడో విజయంపై ఏఎన్‌సీ కన్ను 

ఈసారి మెజారిటీ కష్టమంటున్న సర్వేలు  

మాజీ అధ్యక్షుడు జుమా పార్టీ గట్టి పోటీ 

సియాంకొబా. దక్షిణాఫ్రికాలో అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఊరూవాడా హోరెత్తించిన ఎన్నికల నినాదం. అంటే ‘మాదే ఘనవిజయం’ అని జులు భాషలో అర్థం. కానీ ఘనవిజయం దేవుడెరుగు, ఏఎన్‌సీ ఈసారి సాధారణ మెజారిటీ సాధించడం కూడా కష్టమేనని ఒపీనియన్‌ పోల్స్‌ అంటున్నాయి.

 వర్ణవివక్ష అంతమై తెల్లవారి పాలన ముగిశాక 1994లో ప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచింది మొదలు 30 ఏళ్లుగా ఏఎన్‌సీయే అధికారంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో దానికి తొలిసారి గట్టి పోటీ ఎదురవుతోంది... 

దక్షిణాఫ్రికాలో ఎన్నికలకు వేళైంది. 400 మందితో కూడిన నేషనల్‌ అసెంబ్లీతో పాటు 9 ప్రొవిన్షియల్‌ అసెంబ్లీలకు కూడా బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఏడో విజయం కోసం ఏఎన్‌సీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ పెచ్చరిల్లుతున్న అవినీతి, నిరుద్యోగం, కరెంటు కోతలు, నీటి కొరత, మౌలిక సదుపాయాల లేమి వంటివి పారీ్టకి బాగా ప్రతికూలంగా మారాయి. 

వీటిపై ప్రజాగ్రహం ప్రచారం పొడవునా స్పష్టంగా కన్పించింది. శనివారం అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్వహించిన చివరి ప్రచార సభ కూడా అనుకున్నంతగా విజయవంతం కాలేదు. సభకు వేదికైన చారిత్రక సొవెటో టౌన్‌షిప్‌లోని 90వేల మంది సామర్థ్యమున్న ఫుట్‌బాల్‌ స్టేడియం పూర్తిగా నిండకపోవడం ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 

71 ఏళ్ల రామఫోసాపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఆయనను అభిశంసించాలని పార్లమెంట్‌ నియమించిన న్యాయ నిపుణుల కమిటీ కూడా సూచించింది. అయితే పార్లమెంట్‌లో ఉన్న మెజారిటీ సాయంతో ఆ ప్రక్రియను ఏఎన్‌సీ అడ్డుకుంది. రామఫోసాపై జరిగిన పోలీసు దర్యాప్తు వివరాలు బయటకు రాలేదు. 

వీటన్నింటి నేపథ్యంలో ఈసారి ఏఎన్‌సీ తన చరిత్రలో తొలిసారిగా 50 శాతం కంటే తక్కువ ఓట్లకు పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అదే జరిగితే అతి పెద్ద పారీ్టగా నిలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కదు. ఏఎన్‌సీ ఈసారి ఇతర పారీ్టల మద్దతుపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుందని సర్వేలూ పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఆదివారం వెల్లడ య్యే ఫలితాలపైనే నెలకొంది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

జాకబ్‌ జుమా పంచ్‌... 
మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా గతేడాది రామఫోసాతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడం ఏఎన్‌సీకి పెద్ద దెబ్బ! 82 ఏళ్ల జుమా ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరాడుతున్నారు. ఆయన పార్టీ ఉంకొంతో వెసీజ్వె (ఎంకే) 13 శాతం దాకా ఓట్లు రాబట్టవచ్చని సర్వేల్లో వెల్లడయ్యింది. అధికారంలోకి రాకపోయినా ఏఎన్‌సీ అవకాశాలను బాగా దెబ్బ తీయడం ఖాయమని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా జుమా సొంత ప్రావిన్స్‌ క్వాజులూ నాటాల్‌లో ఏఎన్‌సీ ఆధిపత్యానికి ఎంకే పూర్తిగా గండికొట్టనుందని అంటున్నారు. క్వాజులూ ప్రావిన్స్‌లోని ఎంకే నేతల్లో తెలుగు మూలాలున్న విశి్వన్‌ గోపాల్‌రెడ్డి ప్రముఖ స్థానంలో ఉండటం విశేషం.

బరిలో 51 విపక్షాలు   
దక్షిణాఫ్రికాలో ప్రధాన ప్రతిపక్షం డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (డీఏ). ఈ కూటమికి 22 నుంచి 27 శాతం ఓట్లు రావచ్చని ఏప్రిల్లో ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అయితే పలువురు నేతలు డీఏను వీడి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఇది విపక్ష కూటమికి ప్రతికూలంగా మారింది. ఈసారి 51 ప్రతిపక్షాలు పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఏఎన్‌సీకి కలిసొచ్చేలా కని్పస్తోంది.

ముస్లిం ఓట్లపై వల... 
జనాభాలో ముస్లింలు 2 శాతం కంటే తక్కువే ఉంటారు గానీ వారి ప్రతి ఓటూ విలువైనదే. అందుకే ముస్లింల ఓట్లపై పారీ్టలు వల విసురుతున్నాయి. పాలస్తీనా ఉద్యమానికి పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. గాజాలో దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేస్తున్నాయి.  

ప్రధాన సమస్యలివీ... 
→ తీవ్ర కరెంటు కోతలు 
→ పెచ్చరిల్లిన అవినీతి 
→ పేదరికం (50 శాతం దాటింది) 
→ 32 శాతం దాటిన నిరుద్యోగం 
  (ప్రపంచంలోనే అత్యధికం) 
→ తీవ్ర నీటి కొరత 
→ మౌలిక సదుపాయాల లేమి 
→ మితిమీరిన నేరాలు, హింసాకాండ 
→ రాజకీయ హత్యలు

దక్షిణాఫ్రికా పార్లమెంటులో రెండు సభలుంటాయి. 90 మంది సభ్యులతో కూడిన నేషనల్‌ కౌన్సిల్, 400 మంది సభ్యులుండే నేషనల్‌ అసెంబ్లీ. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో దీని సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మెజారిటీ సాధించే పార్టీ సారథి అధ్యక్షుడవుతారు. దేశ జనాభా 6.2 కోట్లు కాగా ఓటర్లు 2.8 కోట్ల మంది. జనాభాలో 80 శాతానికి పైగా నల్లజాతీయులే. ఈ ఎన్నికల్లో తొలిసారిగా స్వతంత్రులకు కూడా పోటీ చేసే అవకాశం కలి్పంచారు.

ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికావ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ హత్యలు కలకలం సృస్టిస్తున్నాయి. 2023 జనవరి నుంచి 40 మందికి పైగా విపక్ష నేతలు, నిజాయతీపరులైన అధికారులు, హక్కుల కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇది అధ్యక్షుడు రామఫోసా పనేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రచారంలో దీన్ని ప్రధానాంశంగా కూడా మార్చుకున్నాయి. వీటిపై ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 

నేషనల్‌ అసెంబ్లీలో బలాబలాలు 
(మొత్తం స్థానాలు 400) 
ఏఎన్‌సీ                                  230 
డెమొక్రటిక్‌ అలయన్స్‌           84 
ఎకనమిక్‌ ఫ్రీడం ఫైటర్స్‌        44 
ఇతరులు                               42

 

Advertisement
 
Advertisement
 
Advertisement