సాధారణంగా ఏ క్రీడాకారుడికైనా దేశానికి ప్రాతినిథ్యం వహించడమనేది ఓ కల. అయితే సౌతాఫ్రికన్లు మాత్రం ఇందుకు భిన్నం. ఈ మాట చెప్పడానికి కారణాలు లేకపోలేదు. క్రికెట్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ క్రీడ చరిత్రలో అత్యధిక శాతం వలస వెళ్లిన వాళ్లు సౌతాఫ్రికన్లే. వలస వెళ్లడమే కాదు.. దేశం మారాక వారిలో అధిక శాతం మంది స్టార్ క్రికెటర్లయ్యారు.
సౌతాఫ్రికన్లే ఎక్కువ శాతం ఎందుకు విదేశాల్లో కెరీర్‌లు ప్లాన్ చేసుకుంటున్నారన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పేరుకు పెద్ద దేశమే అయినా, ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్దిక వనరులు మాత్రం అంతంతమాత్రమే. క్రికెటర్లు ఇతర దేశాలకు వలస వెళ్లడానికి ఇదే ప్రధాన కారణం.
చరిత్ర చూసుకుంటే, సౌతాఫ్రికాలో పుట్టిన క్రికెటర్లు ఎక్కువ శాతం ఇంగ్లండ్‌కు వలస వెళ్లారు. ఇందుకు కారణం కోల్పాక్ ఒప్పందాలు. ఈ ఒప్పందాల మేరకు 2010లో రూపొందించిన యూరోపియన్ యూనియన్ చట్టాల్లో.. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో స్థానిక ఆటగాళ్లుగా ఆడే అవకాశం పొందారు.
సౌతాఫ్రికాతో పోల్చుకుంటే ఇంగ్లండ్‌లో మెరుగైన వేతనాలు, సౌకర్యాలు, స్థిరమైన కెరీర్ మరియు భవిష్యత్తు, అదనంగా కుటుంబ భద్రత అధికంగా లభిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ శాతం మంది సౌతాఫ్రికాలో జన్మించినా ఇంగ్లండ్‌లో కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు.
ఉదాహరణకు.. సౌతాఫ్రికా దేశవాలీ క్రికెట్‌తో పోలిస్తే, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో అధిక వేతనాలు లభిస్తాయి. ఇంగ్లండ్ కౌంటీలతో ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే స్థిరమైన ఆదాయం కూడా ఉంటుంది. ఈ కారణంగా కెవిన్ పీటర్సన్, జేసన్ రాయ్, జోనాథన్ ట్రాట్, ఆండ్రూ స్ట్రాస్, మ్యాట్ ప్రయర్ లాంటి సౌతాఫ్రికన్లు ఇంగ్లండ్‌కు వలస వెళ్లి, అక్కడ స్టార్లుగా ఎదిగారు. వీరికి ముందు అలన్ లాంబ్, క్రిస్ స్మిత్, డెర్క్ రాండల్ లాంటి వారు కూడా సౌతాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్ దిగ్గజాలుగా మారారు.
ఆర్దిక అవకాశాలు కాకుండా సౌతాఫ్రికన్లు ఇతర దేశాలకు వలస వెల్లడానికి మరో కారణం కెరీర్ స్థిరత్వం. ఇతర దేశాలతో పోలిస్తే.. సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ అవకాశాలు రావడం కాస్త కష్టం. వర్ణానికి సంబంధించిన రిజర్వేషన్ల కారణంగా ఆ జట్టులో పరిమిత అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాల్లో ఈ సమస్య ఉండదు. పౌరసత్వం పొందాకా ఆటలో రాణించగలిగితే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
సౌతాఫ్రికన్లు వలసల బాట పట్టడానికి మరో కారణం కుటుంబ భద్రత మరియు జీవన ప్రమాణాలు. సౌతాఫ్రికాలోని సామాజిక–రాజకీయ అస్థిరత, నేరాల రేటు కారణంగా ఆటగాళ్లు కుటుంబ భద్రత కోసం వలస వెళ్తారు. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇతర దేశాల్లో పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్య సౌకర్యాలు మెరుగ్గా ఉండటం వల్ల వారు వలసలకు ప్రాధాన్యత ఇస్తారు.
క్రికెట్‌లో సౌతాఫ్రికన్ల వలసలకు మరో ప్రధాన కారణం బోర్డు పరిపాలనలో అంతర్గత సమస్యలు. ఆర్దిక సమస్యలతో కొట్టిమిట్టాడే క్రికెట్ సౌతాఫ్రికా (CSA).. పాలనా సమస్యల కారణంగా మరింత పతనమవుతుంది. బోర్డు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఆటగాళ్లను వలసలు వెళ్లేలా ప్రేరేపిస్తాయి.
వీటికి తోడు ప్రైవేట్ టీ20ల్లో లీగ్‌ల్లో పాల్గొనడంపై పరిమితులు ఉండటం సౌతాఫ్రికన్లను వలసలకుప్రోత్సహిస్తుంది. ఇటీవలికాలంలో చాలామంది సౌతాఫ్రికన్లు డబ్బు అధికంగా లభించే ప్రైవేటు టీ20 లీగ్‌ల కోసం జాతీయ జట్టు అవకాశాలను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టారు. హెన్రిచ్ క్లాసెన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ.
ప్రైవేటు టీ20 లీగ్‌ల ప్రభావంతో ప్రస్తుతం సౌతాఫ్రికన్ల వలసల రేటు తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అవకాశాల కోసం ఎదురుచూసే వారు మాత్రం ఇంకా పక్క దేశాలవైపు చూస్తూనే ఉన్నారు. తాజాగా సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ జేజే స్మట్స్ జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో ఇటలీకి వలస వెళ్లాడు. భార్య ద్వారా ఆ దేశ పౌరసత్వం పొంది 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు సంపాదించాడు. స్మట్స్ ఇతర దేశ జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలోనే ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
క్రికెట్ చరిత్రలో ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహించిన సౌతాఫ్రికన్లు (ఇంగ్లండ్ కాకుండా)..
ఆస్ట్రేలియా
మార్నస్ లబూషేన్
కీగన్ మాథ్యూస్
ఫిరోస్ ఎర్ఫాన్
క్లైవ్ ఇంగ్లిస్
న్యూజిలాండ్
గ్రాంట్ ఇలియట్
నీల్ వాగ్నర్
డెవాన్ కాన్వే
లూక్ రోంచి
క్రిస్ కేన్స్
నమీబియా
డేవిడ్ వీస్
జింబాబ్వే
గ్యారీ బ్యాలెన్స్


