‘‘నోర్ముయ్‌!.. లేదా బయటకు పో.. నీ హద్దులో నువ్వు ఉండు!’’ | Israeli Ambassador’s Heated UN Clash Over Blacklisting Reports Goes Viral, More Details Inside | Sakshi
Sakshi News home page

‘‘నోర్ముయ్‌!.. లేదా బయటకు పో.. నీ హద్దులో నువ్వు ఉండు!’’

Jun 20 2026 9:32 AM | Updated on Jun 20 2026 10:08 AM

Shouting Match at the UN: Israeli Envoy and Top Official Trade Barbs

ఐక్యరాజ్యసమితి (UN) వేదికపై దౌత్య మర్యాదలు పక్కనపడ్డాయి. ఇజ్రాయెల్‌ను తొలిసారిగా లైంగిక హింస, చిన్నారుల హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన బ్లాక్‌లిస్టులో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ దేశ రాయబారి డ్యానీ డానన్‌.. ఐరాస ఉన్నతాధికారులతో బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. ఒక దశలో "నోరు మూసుకోండి" అంటూ అధికారిణిపై కావరం ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

న్యూయార్క్‌లో శుక్రవారం "సాయుధ ఘర్షణల్లో లైంగిక హింస నిర్మూలన దినోత్సవం" సందర్భంగా ఐరాస సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ రాయబారి డ్యానీ డానన్‌ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ను లైంగిక హింసకు సంబంధించిన ఆరోపణల జాబితాలో చేర్చిన ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నారని.. ప్రమీలా పాటెన్‌ కూడా అదే వైఖరికి లొంగిపోయారని ఆరోపించారు. అంతేకాదు, ఆమె తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్‌ చేశారు. డానన్‌ వ్యాఖ్యల మధ్యలో చిన్నారులు, సాయుధ ఘర్షణల అంశాలపై ఐరాస ప్రతినిధిగా ఉన్న వానెస్సా ఫ్రాజియర్‌ జోక్యం చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ ధ్రువీకరించిన ఆధారాల ఆధారంగానే నమోదు చేశామని చెప్పారు. దీనికి ఆగ్రహించిన డానన్‌..

"మేము సభ్య దేశం. మీరు ఐరాస ఉద్యోగి మాత్రమే. మీ హద్దులో మీరుండాలి. ఇప్పుడు మీరు నోరు మూసుకోవాలి. లేదంటే బయటకు పోండి. మీ నివేదిక సిగ్గుచేటు" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వివాదానికి కారణం ఏంటంటే.. 
ఇటీవల ఐరాస విడుదల చేసిన రెండు కీలక నివేదికల్లో ఇజ్రాయెల్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చింది. సాయుధ ఘర్షణల సమయంలో లైంగిక హింస, అలాగే చిన్నారులపై జరుగుతున్న ఉల్లంఘనలకు సంబంధించి ఇజ్రాయెల్‌పై తొలిసారిగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా చిన్నారులపై ఉల్లంఘనలు గణనీయంగా పెరిగాయని ఐరాస పేర్కొంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు శత్రువైన హమాస్‌ కూడా ఈ బ్లాక్‌లిస్టులో కొనసాగుతోంది.

ఇజ్రాయెల్‌ ఆగ్రహం
ఈ నివేదికలు వెలువడినప్పటి నుంచే ఇజ్రాయెల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నివేదికలు పక్షపాత ధోరణితో రూపొందించబడ్డాయని ఆరోపిస్తున్న ఆ దేశం.. ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్‌తో అధికారిక సంబంధాలను తెంచుకుంటామని కూడా హెచ్చరించింది.

తాజా ఘటనతో ఐరాస–ఇజ్రాయెల్‌ మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘనల అంశాలపై ఇరువైపులా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న వేళ.. ఐరాస వేదికపై జరిగిన ఈ మాటల యుద్ధం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement