‘సీమా హైదర్‌ ఒక దొంగ.. నేరస్తురాలు.. ఉరికంబం ఎక్కిస్తా’ | Sakshi
Sakshi News home page

Seema Haider: ‘సీమా హైదర్‌ ఒక దొంగ.. నేరస్తురాలు.. ఉరికంబం ఎక్కిస్తా’

Published Mon, Jan 8 2024 1:45 PM

Seema Haider Pakistani Husband Ghulam Haider Will Come to Bharat - Sakshi

పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ తన ప్రియుడు సచిన్ మీనా కోసం తన పిల్లలతో సహా భారత్‌కు వచ్చేసింది. ఆమె భారతదేశానికి వచ్చినప్పటి నుండి.. ఆమె పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తన భార్య సీమా హైదర్‌ను, పిల్లలను తిరిగి వెనక్కి పంపాలని సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాడు. 

గులాం హైదర్‌కు చెందిన పలు వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో ఆమెను వెనక్కి పంపించాలంటూ అతను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కనిపిస్తుంది.

సీమా హైదర్ భారతదేశానికి వచ్చిన తర్వాత, పాకిస్తాన్‌లోని ఆమె భర్త గులాం హైదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంపై తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. ఈ ఛానెల్ ద్వారా గులాం హైదర్ తన సందేశాన్ని భారత్‌, పాకిస్తాన్ ప్రజలకు తెలియజేయజేసే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇటీవల గులాం హైదర్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను భారత ప్రభుత్వానికి మరోమారు విజ్ఞప్తి చేస్తూ కనిపిస్తున్నాడు. గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్‌కు తిరిగి పంపించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడాన్ని ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. 

మరోవైపు సీమా హైదర్ తరపు న్యాయవాది ఏపీ సింగ్, నేత్రపాల్‌లను గులాం హైదర్‌ హెచ్చరిస్తూ కూడా వీడియోలో కనిపిస్తున్నాడు. వీలైనంత త్వరలో తాను పాకిస్తాన్ నుంచి భారత్‌కు వస్తానని కూడా గులాం హైదర్ ఆ వీడియోలో వెల్లడించాడు.

ఆ వీడియోలో గులాం హైదర్ తన భార్య సీమా హైదర్‌పై పలు ఆరోపణలు చేస్తూ.. తన పిల్లలను పాకిస్తాన్ నుంచి భారత్‌కు అక్రమంగా తీసుకెళ్లిందని ఆరోపించాడు. తన పిల్లలను తనతోపాటు తీసుకురావడానికి తాను ఖచ్చితంగా భారతదేశానికి వెళ్తానని, భారతదేశ ప్రజలపై, భారతదేశ చట్టాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని గులాం హైదర్ పేర్కొన్నాడు. తన పోరాటానికి భారత్‌లో తప్పకుండా మద్దతు దొరుకుతుందని అన్నాడు. 

‘సీమా హైదర్ ఒక దొంగ... నేరస్తురాలు.. నా ఆస్తి, ఇల్లు అమ్మేసి ఇండియా పారిపోయింది. అందుకే ఈరోజున నేను రోడ్డున పడ్డాను. సీమా.. ఇక నువ్వు ఏం చేసినా తప్పే.. నువ్వు ఏడుస్తావు.. పశ్చాత్తాపపడతావు.. బాధపడతావు.. ఆర్తనాదాలు చేస్తావు.. ఏదో ఒక రోజు నేను నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను.. ఇదే నా జీవిత లక్ష్యం’ అని ఆ వీడియోలో గులాం హైదర్ పేర్కొన్నాడు. 

ప్రధాని మోదీ, సీఎం యోగితో పాటు పాకిస్తాన్ ప్రభుత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని గులాం హైదర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అలాగే సీమా హైదర్‌ ప్రేమికుడు సచిన్ మీనా, ఏపీ సింగ్, నేత్రపాల్‌లను హెచ్చరించాడు.. ‘గుర్తుంచుకోండి.. మీరు ఇప్పటివరకు ఏమి చేసినా.. ఏదో ఒకరోజు మీ అందరికీ శిక్ష పడుతుంది’ అని పేర్కొన్నాడు. 
ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్‌ విచారణలో సంచలన నిజాలు!

Advertisement
Advertisement