భారత్‌పై ఆంక్షలు విధిస్తే బూమరాంగే!  | Sanctions threat to India would boomerang under PM Narendra Modi | Sakshi
Sakshi News home page

భారత్‌పై ఆంక్షలు విధిస్తే బూమరాంగే! 

Jun 7 2026 4:11 AM | Updated on Jun 7 2026 6:43 AM

Sanctions threat to India would boomerang under PM Narendra Modi

అలాంటి హెచ్చరికలు పనిచేయవు  

ఆంక్షల బెదిరింపులతో భారత్‌ను లొంగదీసుకోలేరు  

తేల్చిచెప్పిన రష్యా అధినేత పుతిన్‌ 

సెయింట్‌పీటర్స్‌బర్గ్‌:  నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న భారతదేశంపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వెంటనే మానుకోవాలని రష్యా అధినేత పుతిన్‌ హితవు పలికారు. ఆంక్షల బెదిరింపుల ద్వారా భారత సార్వభౌమతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే తక్షణమే పెద్ద ఎదురుదెబ్బ(బూమరాంగ్‌) తగులుతుందని తేల్చిచెప్పారు. 

శుక్రవారం సెంటర్‌ పీటర్స్‌బర్గ్‌ అంతర్జాతీయ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పుతిన్‌ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ ఎల్లప్పుడూ ఒక సార్వభౌమ దేశంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆంక్షల బెదిరింపులతో భారత్‌ను లొంగదీసుకోలేరని పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రధాని మోదీతో తాను చాలాకాలంగా సన్నిహితంగా చర్చలు జరుపుతున్నానని తెలిపారు. 

అమెరికాలోకి ప్రవేశించకుండా మోదీపై గతంలో నిషేధం విధించారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని మోదీ ఎప్పటికీ మర్చిపోలేరన్న సంగతి తనకు తెలుసని అన్నారు. మోదీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఆయనపై అన్ని ఆంక్షలను తొలగించారని పేర్కొన్నారు. తనకు తెలిసినంతవరకు అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. పుతిన్‌ ఇంకా ఏం చెప్పారంటే..  

ఆ స్వేచ్ఛ భారత్‌కు ఉంది  
‘‘భారత్‌ ఒక సార్వభౌమ దేశం. అత్యంత ఆధునికమైనవి, అనువైనవి, ఉత్తమ ధరకు లభించే ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్‌కు ఉంది. అందించేవిగా భావించే ఉత్పత్తులను ఎంచుకోవడానికి దానికి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏమనుకున్నప్పటికీ సొంత ప్రయోజనాల పరిరక్షణ విషయంలో భారత్‌ రాజీపడడం లేదు. ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. 

నచ్చిన దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం భారత్‌ హక్కు. భారత్‌–రష్యా బంధం ఇతర భాగస్వాముల బంధం లాంటిది కాదు. భారత్‌తో రష్యా సహకారం కూడా రాజకీయ వాతావరణానికి లోబడి ఉండదు. మమ్మల్ని ఎవరూ శాసించలేరు. మాకు ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరు. అలా చేయడానికి ఎవరూ ప్రయత్నించరు కూడా. మేము ఎల్లప్పుడూ సరైనదని భావించిన దానినే చేస్తాం. 

భారత్‌ వంటి విలువైన భాగస్వాములకు ఇచ్చిన హామీలకు ఎల్లప్పుడూ మేము కట్టుబడి ఉంటాం. భారత్, రష్యా స్నేహానికి పరస్పర విశ్వాసమే పునాది. భారతీయ మిత్రులతో మా సంబంధాలు ప్రత్యేకమైనవి. మేము కేవలం వాణిజ్యంపైనే దృష్టి పెట్టడం లేదు. కొనుగోలు, అమ్మకాలపైనే కాకుండా, ఉమ్మడి పరిశోధనలు, అభివృద్ధిపైనా దృష్టి పెట్టాం. బ్రహ్మోస్‌ మధ్యశ్రేణి క్షిపణి రూపకల్పనపై ఇరు దేశాల నిపుణులు కలిసి పని చేస్తున్నారు’’అని పుతిన్‌ స్పష్టంచేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement