కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బీభత్సం సృష్టించింది. ప్రజా రవాణా లక్ష్యంగా రష్యా సైన్యం గ్లైడ్ బాంబ్‌ల వర్షం కురిపించింది. ఈ దాడిలో బస్సుల్లో ప్రయాణిస్తున్న 33 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 18మంది తీవ్రంగా గాయపడ్డారు.
తూర్పు భాగంలో రష్యా బలగాలకు అతి దగ్గరగా..ఉక్రెయిన్ సైన్యానికి కీలకమైన రక్షణ ప్రాంతమైన ఫ్రంట్‌లైన్ సిటీ క్రమటోర్స్క్ నగరంలో రష్యా జరిపిన భీకర గ్లైడ్ బాంబ్ దాడి చేసింది. ఈ దాడిలో భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘోర ప్రమాదంపై దొనెత్స్క్ గవర్నర్ వాదిమ్ ఫిలాష్కిన్ మాట్లాడుతూ.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులపై రష్యా బలగాలు ఉద్దేశ పూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు, రోడ్డుపై చెల్లాచెదురైన శిథిలాలను ఉక్రెయిన్ అటార్నీ జనరల్ కార్యాలయం విడుదల చేసింది. భద్రతా పరిస్థితి క్షీణించడంతో క్రమటోర్స్క్, స్లోవియాన్స్క్ ప్రాంతాలలో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు. అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
మధ్య ఉక్రెయిన్ ప్రిలుకి నగరంలో రష్యా జరిపిన మరో దాడిలో ఐదు అంతస్తుల నివాస భవనం నేలమట్టమైంది. ఐదుగురు పిల్లలతో సహా మొత్తం 22 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు బీబీసీ నివేదించింది. రాజధాని కీవ్ చుట్టూ కూడా దాడులు పెరిగాయి. గురువారం జరిగిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 14 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్లిట్చ్కో వెల్లడించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పెరుగుతున్న ప్రాణనష్టాలు
ఉక్రెయిన్‌లో పౌర మరణాలు భారీగా పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాదిలో మొత్తం జరిగిన ప్రాణ నష్టంతో పోలిస్తే.. ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లోనే ఉక్రెయిన్‌లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస తెలిపింది. దొనెత్స్క్ ప్రాంతంలోని కీలక నగరాలను కైవసం చేసుకునేందుకు రష్యా ఈ విధ్వంసకర వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా ఉద్దేశ పూర్వకంగానే పౌరులను టార్గెట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సైనిక లక్ష్యాలు లేని ప్రాంతాలపై రష్యా మళ్లీ మళ్లీ దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఈ దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు ప్రజా రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. రష్యా దాడులను ఖండించిన ఆయన, ఉక్రెయిన్‌కు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలు తక్షణమే అందించాలని అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలను కోరారు.
ఇదీ చదవండి : ఉక్రెయిన్ వార్ వేళ బిగ్ ట్విస్ట్.. ట్రంప్ లక్ష కోట్ల మాస్టర్ ప్లాన్!


