
ఎన్నికల్లో రష్యా అనుకూల గ్రూపులకు పరాజయం
రష్యా జోక్యం అనుమానాల నేపథ్యంలో ఫలితం వెల్లడి
చిసినౌ: ఒకప్పటి సోవియెట్ యూనియన్‌లో భాగంగా ఉన్న మాల్దోవాలో జరిగిన ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్(ఈయూ) అనుకూల పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. రష్యా అనుకూల గ్రూపులకు ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. తూర్పు, పశ్చిమ వర్గాలకు మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో వెలువడిన ఈ ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లలో లెక్కింపు పూర్తయ్యాక వెలువడిన ఫలితాల్లో ఈయూకు అనుకూల విధానాలను అనుసరించే అధ్యక్షురాలు మైయా సండూకు చెందిన అధికార యాక్షన్ అండ్ సాలిడారిటీ(పీఏఎస్)కు 50.1 శాతం ఓట్లు వచ్చినట్లు తేలింది.
రష్యా అనుకూల పేట్రియాటిక్ ఎలక్టోరల్ బ్లాక్‌కు కేవలం 24.2 శాతమే లభించాయి. రష్యాతో మైత్రిని కోరుకునే మరో గ్రూప్ ఆల్టర్నేటివా మూడవ, పాపులిస్ట్ అవర్ పార్టీ నాలుగో స్థానాల్లో నిలిచాయి. డెమోక్రసీ ఎట్ హోమ్ అనే పార్టీ కూడా పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం దక్కించుకుంది. అధికార పీఏఎస్‌కు 101 సీట్లున్న పార్లమెంట్‌లో 55 స్థానాలు దక్కాయి.
తిరిగి రష్యాకు అనుకూలంగా మారడమా, లేక ఈయూ మార్గంలో నడవడమా అనే విషయం మాల్దోవా వాసులు తేల్చుకునే నిర్ణయాత్మక ఎన్నికలుగా వీటిని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలతో ప్రస్తుత ప్రభుత్వ విధానాలు కొనసాగుతాయని, ఈయూలో చేరాలని భావించే మాల్దోవా వాసులకు ఘన విజయంగా భావించవచ్చని అంటున్నారు. ఫలితాలపై ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌డెర్ లేయెన్ హర్షం వ్యక్తం చేశారు. ‘యూరప్, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ’కోసం మాల్దోవా ప్రజల నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడిందన్నారు.