
సరిహద్దుల్లో గుర్తు తెలియని డ్రోన్ల సంచారం నేపథ్యంలో ప్రతిపాదన
ఇందుకు రష్యానే కారణమని అనుమానాలు
కొత్త ప్రాజెక్ట్‌పై ఈయూ రక్షణ మంత్రుల అంగీకారం
బ్రస్సెల్స్: రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్ దేశాలు మరిన్ని ఆత్మరక్షణ చర్యలకు నడుం బిగించాయి. రష్యా డ్రోన్లు, యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటుచేసుకుంటుండటం ఈ దేశాలను మరింత అప్రమత్తం చేసింది. రష్యా, ఉక్రెయిన్‌లతో తమకున్న సరిహద్దు గగనతలాల్లో చోటుచేసుకునే ఉల్లంఘనలను సకాలంలో గుర్తించి, అడ్డగించేందుకు సమగ్ర రక్షణ వ్యవస్థ, డ్రోన్ వాల్‌ను ఏర్పాటు చేసుకోవాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు నిర్ణయించాయి.
శుక్రవారం బెల్జియం రాజధాని బ్రసెŠస్‌ల్స్‌లో జరిగిన ఈయూ రక్షణ మంత్రుల వర్చువల్ సమావేశం ఈ మేరకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇటీవల పెరిగిపోయిన గగనతల ఉల్లంఘనలపై సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిలో కొన్ని ఉల్లంఘనలకు రష్యానే కారణమంటూ దేశాలు నిందిస్తున్నాయి. అయితే, వీటికి తాము కారణం కాదని, ఉద్దేశపూర్వకంగా వీటిని ప్రయోగించామంటూ తమపై ఆరోపణలు వేయడం సరికాదని రష్యా అంటోంది. సభ్య దేశాల గగనతలంలోకి ప్రవేశించే రష్యా డ్రోన్లు, యుద్ధ విమానాలను కనిపించిన వెంటనే కూల్చేయాలంటూ నాటోకు ఆదేశాలిచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
చొరబాటు ఘటనలను నివారించేందుకు డ్రోన్ వాల్/ డ్రోన్ షీల్డ్ మాత్రమే సరైన పరిష్కారమనే అభిప్రాయానికి తాజాగా ఈయూ మంత్రులు వచ్చారు. ‘ఈయూ, నాటోలను రష్యా పరీక్షిస్తోంది. మా స్పందన వేగంగా, దీటుగా, ఐక్యంగా ఉండాలి’అని ఈయూ రక్షణ కమిషనర్ అండ్రియస్ కుబిలియస్ పేర్కొన్నారు. ఈ చర్చల్లో 10 తూర్పు యూరప్ దేశాల మంత్రులతోపాటు ఉక్రెయిన్, నాటో అధికారులు పాలుపంచుకున్నారు. డ్రోన్ షీల్డ్‌ను పూర్తి చేసేందుకు కనీసం ఏడాది పట్టొచ్చని కుబిలియస్ చెప్పారు.
‘సవివరమైన, సాంకేతికపరమైన రోడ్ మ్యాప్ రూపకల్పనకు ఆయా దేశాల రాయబారులు త్వరలోనే సమావేశమవుతారు. మా దృష్టంతా సమర్థవంతమైన ఉల్లంఘనల హెచ్చరికల వ్యవస్థను నెలకొల్పడంపైనే ఉంది’అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ ప్రతిపాదనపై వచ్చే వారం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో జరిగే ఈయూ నేతల శిఖరాగ్రంలోనూ చర్చ జరుగుతుందన్నారు. అక్టోబర్ మరోసారి భేటీ అయ్యే ఈయూ రక్షణ మంత్రులు, తమ వెంట రక్షణ పరిశ్రమల ప్రతినిధులను కూడా తీసుకువస్తారని కుబిలియస్ వివరించారు. శుక్రవారం జరిగిన సమావేశం ఒక మైలురాయి వంటిదని అభివర్ణించారు. ఇప్పటి నుంచి అసలైన కార్యాచరణ మొదలవుతుందని వెల్లడించారు.
మార్చిలో ప్రతిపాదన వచ్చినా..
ఫిన్లాండ్, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలండ్ దేశాలు డ్రోన్ వాల్ ప్రాజెక్టుపై కొన్ని నెలలుగా పనిచేస్తున్నాయని ఈయూ రక్షణ కమిషనర్ ఆండ్రియస్ కుబిలియస్ పేర్కొన్నారు. డ్రోన్ షీల్డ్ ఏర్పాటుకు అవసరమైన నిధులు సమకూర్చాలంటూ మార్చిలో ఎస్టోనియా – లిథువేనియాలు చేసిన వినతిని ఈయూ పట్టించుకోలేదు. అయితే, ఈలోగా పరిస్థితులు మారాయి. గురు, శుక్రవారాల్లో డెన్మార్క్‌తో తమ సరిహద్దులకు సమీపంలో డ్రోన్ల సంచారాన్ని గుర్తించామని జర్మనీ పేర్కొంది. దీంతో, డ్రోన్ గోడ అవసరాన్ని అందరూ గుర్తించారని కుబిలియస్ తెలిపారు.
సెప్టెంబర్ 10వ తేదీన పోలెండ్ గగనతలంలోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను కూల్చి వేసేందుకు నాటో యుద్ధవిమానాలు రంగంలోకి దిగాయి. కేవలం చిన్న బెదిరింపునకే ఖరీదైన ప్రతిచర్యకు దిగాల్సి వచ్చిందన్నారు. డ్రోన్ల సంచారం కనిపించడంతో ఇటీవల డెన్మార్క్‌లోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. రష్యాతో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర దేశాల్లోనూ ఇలాంటి భయాలే నెలకొన్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు సైతం హైబ్రిడ్ యుద్ధం అనుభవాన్ని చవి చూస్తున్నాయని పోలెండ్ రక్షణ మంత్రి వ్లాడిస్లావ్ కోసినియక్–కమీజ్ అన్నారు. రష్యా నుంచి దీని తీవ్రంగా మరీ ఎక్కువగా ఉంది, వీటిపై సరైన రీతిలో స్పందించాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు.
యుద్ధ నౌక నుంచి లేదా మరేదైనా పడవ నుంచి డ్రోన్లను అత్యంత సులువుగా ప్రయోగించే ప్రమాదమున్నందున తూర్పు దేశాలే కాదు, మొత్తం యూరప్‌లోని దేశాలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సమగ్ర భద్రత కోసం ముందుకు రావాలన్నారు. ఇలా ఉండగా, కోపెన్‌హాగెన్‌లో వచ్చే వారం జరిగే శిఖరాగ్రాలకు కనీసం డజను మంది దేశాల నేతలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, డ్రోన్ బెడద తీవ్రంగా ఉన్నందున మిలటరీ యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన రుణ సాయం అందిస్తామని పొరుగునున్న స్వీడన్ ముందుకు వచ్చింది. ఈ వ్యవస్థ అనుమానాస్పద డ్రోన్లను కనిపెట్టిన వెంటనే కూల్చివేస్తుందని ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ చెప్పారు. దీనిపై డెన్మార్క్ సానుకూలంగా స్పందించింది.