
ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు పెద్ద ఎత్తున అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ఎగుమతులను పెంచుకోవచ్చని, 27 దేశాల కూటమికి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలతో కొత్త భాగస్వామ్యాలకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
భారత ప్రజలకు సరైన టెక్నాలజీ, సరైన రవాణా పరిష్కారాలను తీసుకొచ్చేందుకు వీలుంటుందన్నారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయంటూ.. ఆటోమొబైల్ రంగానికి ఇది ఎంతో ముఖ్యమన్నారు. ఈయూలో మార్కెట్ అవకాశాలపై అవగాహన కుదిరిన వెంటనే చర్చలను త్వరగా ముగిస్తామని చెప్పారు.
ఈయూ అధికారుల బృందం ఢిల్లీలో 13వ విడత చర్చలు నిర్వహించిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి సుంకాల్లో రాయితీలు ఇవ్వాలని ఈయూ బృందం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఈ ఏడాది మే 6న బ్రిటన్‌తో కుదిరిన ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఆ దేశ ఆటోమొబైల్ కంపెనీలకు భారత్ రాయితీలను కల్పించడం తెలిసిందే. దీంతో ఈయూ సైతం ఇదే విధమైన డిమాండ్ చేస్తోంది.
బ్రిటన్‌తో ఒప్పందం వల్ల ఆటోమొబైల్ దిగుమతులపై టారిఫ్‌లు 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతాయని అగర్వాల్ చెప్పారు. అది కూడా 10–15 ఏళ్ల కాలంలో క్రమంగా అమలవుతుందన్నారు. సున్నిత రంగాల ప్రయోజనాలను కాపాడేందుకు యూకేతో ఒప్పందంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. భారత ఆటోమొబైల్ రంగం ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా క్రమంగా భారత్ మార్కెట్ అవకాశాలకు తలుపుల తెరిచే నిబంధనలు పెడుతున్నట్టు వివరించారు.