
మరో నలుగురు భారతీయ అమెరికన్లకు స్థానం
లండన్: ప్రతిష్టాత్మక టైమ్ 100 క్రియేటర్స్ జాబితాలో ఒక భారతీయురాలితోపాటు భారత సంతతికి చెందిన నలుగురు కంటెంట్ రైటర్లు చోటు దక్కించుకున్నారు. యూ ట్యూబర్, నటి అయిన ప్రజక్తా కోలి(32)కి భారత్ నుంచి చోటు దక్కడం విశేషం. భారతీయ అమెరికన్లు ధర్ మాన్, మిచెల్ ఖరె, సమీర్ చౌదరి, జే షెట్టి కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, చర్చలు, సంఘాలను ప్రభావితం చేసే అత్యంత ప్రభావశీలురైన డిజిటల్ సృష్టికర్తలను టైమ్ ఎంపిక చేసింది.
మొట్టమొదటి సారిగా రూపొందించిన ఈ జాబితాలో టైటాన్స్, ఎంటర్‌టెయినర్స్, లీడర్స్, ఫెనొమ్స్, కేటలిస్ట్స్ అనే ఐదు కేటగిరీల్లో 15 దేశాలకు చెందిన వారున్నారు. టైటాన్స్ విభాగంలో భారత సంతతికి చెందిన ధర్ మాన్(41) సామాజిక, మానవీయ విలువలను కథల మాదిరిగా బోధిస్తూ యూట్యూబ్ షార్ట్ వీడియోలను రూపొందించడంలో పేరు తెచ్చుకున్నారు. ఈయన చానెల్‌కు 2.50కోట్ల మంది సబ్ స్క్రైబర్లున్నారు.
నికెలోడియన్ కిడ్స్ చాయిస్ అవార్డులకు రెండుసార్లు నామినేట్ అయ్యారని టైమ్ మేగజీన్ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌ల్లో డిగ్రీలు సంపాదించారు. లీడర్స్ కేటగిరీలో భారతీయ అమెరికన్ యూట్యూబర్ మిచెల్ ఖరె స్థానం సంపాదించుకున్నారు. తన యూట్యూబ్ చానెల్‌లో ‘ఛాలెంజ్ యాక్సెప్టెడ్’సిరీస్‌తో బాగా పేరు తెచ్చుకున్నారు. ఈ చానెల్‌కు 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.
1992లో లూసియానాలో జన్మించిన ఖరె..డార్ట్‌మౌత్ కాలేజీ నుంచి డిజిటల్ ఆర్ట్స్ అండ్ మీడియా టెక్నాలజీలో డిగ్రీ చేశారు. టైమ్ మేగజీన్ జాబితాలో లీడర్స్ కేటగిరీలో ఎంపికైన జె షెట్టి(37) బ్రిటన్‌కు చెందిన భారత సంతతి రచయిత, పాడ్‌కాస్టర్. కొంతకాలం హిందూ సన్యాసిగా గడిపారు. ప్రపంచవ్యాప్తంగా అనుచరులున్నారు. టిక్‌టాక్, ఇన్‌స్టాలో 2.2 కోట్ల ఫాలోయర్లు, యూట్యూబ్ చానెల్‌కు 90 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.
ఇతడి తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి లండన్‌లో స్థిరపడ్డారు. టాప్ 100 జాబితాలో మరో భారతీయ అమెరికన్ సమీర్ చౌదరి పేరూ ఉంది. ఇతని యూట్యూబ్ చానెల్ ‘కొలిన్ అండ్ సమీర్’కు 16 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానెల్ సహనిర్వాహకుడు కొలిన్ రొజెన్ బ్లమ్‌కూ ఈ జాబితాలో చోటు దక్కింది. కాలిఫోర్నియాలోని శాంటామోనికాలో 1989లో జన్మించిన సమీర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిల్మ్ అండ్ డిజిటల్ మీడియాలో విద్యనభ్యసించారు.
ప్రజక్తా కోలి ఎవరంటే..?
మహారాష్ట్రకు చెందిన ప్రజక్తా కోలి నటి, యూట్యూబర్. మోస్ట్‌లీసేన్ అనే యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. రోజువారీ జీవితంపై హాస్యం పుట్టించేలా ఉండే ఈమె చానెల్‌కు 70 లక్షల మంది, ఇన్‌స్టాలో 80 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో మిస్‌మ్యాచ్డ్ అనే సిరీస్‌తోపాటు, జుగ్‌జుగ్ జీయే అనే సినిమాలోనూ నటించారు. పలు పుస్తకాలు రాశారు.