
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాకిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ట్రంప్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇరు దేశాల ఉద్రిక్తతలు చల్లారడంలో ఎవరి ప్రమేయం లేదని.. ఇక మీదట కూడా ఉండబోదని ట్రంప్‌నకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు ఫోన్ ద్వారా అరగంట మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి.. దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను మోదీ ట్రంప్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే..
మోదీ ట్రంప్‌తో మాట్లాడుతూ.. పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్‌పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి.
పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై భారత్‌లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారాయన. దీనికి ట్రంప్ ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరునకు అమెరికా మద్ధతు ఉంటుందని తెలిపారు.
ట్రంప్-మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ మోదీకి సంతాపం తెలియజేశారని, ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదేనని మిస్రీ తెలిపారు. అయితే కెనడా పర్యటన ముగిచుకుని వెళ్లే క్రమంలో అమెరికాకు రావాలంటూ ట్రంప్ మోదీని ఆహ్వానించగా.. షెడ్యూల్ ప్రకారం తాను రాలేనని మోదీ తెలిపినట్లు సమాచారం. భారత్‌లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు.. భారత్‌లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారు
ఇదిలా ఉంటే.. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకోవడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రకటనపై స్పష్ట త ఇవ్వాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేశాయి కూడా.