ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు | PM Modi and Macron discuss expansion of India UPI in France | Sakshi
Sakshi News home page

ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

PM Modi and Macron discuss expansion of India UPI in France

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్, ప్రధాని మోదీ సీరియస్‌ ముచ్చట

భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ నిర్ణయం  

ద్వైపాక్షిక చర్చల్లో 13 అంశాలపై కుదిరిన అంగీకారం  

ఇన్నోవేషన్‌ కోసం ఉమ్మడిగా రోడ్‌మ్యాప్‌ 

ఇకపై ఫ్రాన్స్‌లోనూ భారత యూపీఐ సేవలు  

పారిస్‌: వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్‌ నిశ్చయించుకున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 16 మిలియన్‌ డాలర్లుగా ఉంది. కృత్రిమ మేధ(ఏఐ), స్టార్టప్‌లు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆరోగ్యం సహా కీలక రంగాలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ నిర్ణయానికి వచ్చారు.

ఆదివారం వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్‌–ఫ్రాన్స్‌ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు. ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరత, భద్రత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాలపై చర్చించారు.  

కాన్పూర్‌లో ‘నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ 
సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో సంబంధాలను పటిష్టం చేసుకోవడంపై ఇరువురు మోదీ, మేక్రాన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే సైన్స్, అంతరిక్షం, స్టార్టప్‌లు, ఫిన్‌టెక్, పౌర అణుశక్తి, మౌలిక సదుపాయాల రంగాలపైనా చర్చ జరిగింది. మొత్తం 13 అంశాలపై అంగీకారం కుదిరింది. ఆవిష్కరణల(ఇన్నోవేషన్‌) కోసం ఉమ్మడిగా రోడ్‌మ్యాప్‌ ఏర్పాటు చేసుకోవాలని, రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని, ఉమ్మడి ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.

అలాగే హైస్పీడ్‌ రైల్వే రంగంలో సహకారం కోసం డిక్లరేషన్, వర్గీకృత డేటాను పరిరక్షించే భద్రతా ఒప్పందాన్ని కూడా ఇరుపక్షాలు ఖరారు చేశాయి. ఇండియాకు చెందిన యూపీఐ చెల్లింపుల సేవలను ఫ్రాన్స్‌కు సైతం విస్తరింపజేయనున్నారు. ఫ్రెంచ్‌ రక్షణ రంగ దిగ్గజం దసాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థ నుంచి 114 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న భారతదేశ ప్రణాళిక కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది.

మోదీ–మేక్రాన్‌ భేటీ అనంతరం.. ఏరోనాటిక్స్, అనుబంధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కాన్పూర్‌లో ‘నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఫ్రాన్స్‌ విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement