
భూమిపై ఉన్న అతిపెద్ద, అరుదైన అంగారక గ్రహ శకలం మార్టిన్ ఉల్క (ఎన్‌డబ్ల్యూఏ 16788) వేలానికి వెళ్లనుంది. ఈ శకలం సుమారు 25 కిలోల బరువున్నది. ఇది 2023లో సహారా ఎడారిలో దొరికింది. అంగాకరక గ్రహం నుంచి భూమిపై ఇప్పటివరకూ పడ్డ ఇతర శకలాల కంటే దాదాపు 70% పెద్దది. దీనిని న్యూయార్క్‌లోని సోతేబైస్‌లో జూలై 16న వేలం నిర్వహించనున్నారు. ఇది సుమారు రూ. 33.4 కోట్లకు అమ్ముడుపోవచ్చని అంచనా వేస్తున్నారు.
మార్టిన్ ఉల్కలు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పటివరకూ భూమిపై అధికారికంగా కనుగొన్న 77,000 గుర్తించిన ఉల్కలలో ఇవి కేవలం 0.6 శాతం మాత్రమే. ఏదైనా ఆస్టరాయిడ్ మార్స్‌ను ఢీకొట్టడం వల్ల ఇది అంతరిక్షంలోకి వచ్చి ఉంటుంది. 225 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణించి చివరికి భూమికి చేరుకుంది.
‘ఇది కేవలం ఒక అద్భుత ఆవిష్కరణ మాత్రమే కాదు, మన పొరుగున ఉన్న అంగారక గ్రహం రహస్యాలను తెలుసుకోవడానికి సహాయపడే భారీ డేటాసెట్’ అని సోథెబైస్ సైన్స్ అండ్ నేచురల్ హిస్టరీ వైస్ చైర్మన్ కాసాండ్రా హాటన్ అన్నారు. ఎన్‌డబ్ల్యూ 16788పై భూసంబంధమైన వాతావరణం కనిపిస్తోందని, అన్ని మైళ్ల ప్రయాణం తరువాత కూడా దాని భౌతిక, రసాయన నిర్మాణం చెక్కుచెదరకుండా ఉందని తెలి పారు. అయితే.. వేలం ద్వారా విలువైన పరిశోధనా సామగ్రి ప్రైవేట్ చేతులకు వెళ్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్