breaking news
Sotheby
-
వేలానికి అరుదైన అంగారక శకలం
భూమిపై ఉన్న అతిపెద్ద, అరుదైన అంగారక గ్రహ శకలం మార్టిన్ ఉల్క (ఎన్డబ్ల్యూఏ 16788) వేలానికి వెళ్లనుంది. ఈ శకలం సుమారు 25 కిలోల బరువున్నది. ఇది 2023లో సహారా ఎడారిలో దొరికింది. అంగాకరక గ్రహం నుంచి భూమిపై ఇప్పటివరకూ పడ్డ ఇతర శకలాల కంటే దాదాపు 70% పెద్దది. దీనిని న్యూయార్క్‌లోని సోతేబైస్‌లో జూలై 16న వేలం నిర్వహించనున్నారు. ఇది సుమారు రూ. 33.4 కోట్లకు అమ్ముడుపోవచ్చని అంచనా వేస్తున్నారు. మార్టిన్ ఉల్కలు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పటివరకూ భూమిపై అధికారికంగా కనుగొన్న 77,000 గుర్తించిన ఉల్కలలో ఇవి కేవలం 0.6 శాతం మాత్రమే. ఏదైనా ఆస్టరాయిడ్ మార్స్‌ను ఢీకొట్టడం వల్ల ఇది అంతరిక్షంలోకి వచ్చి ఉంటుంది. 225 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణించి చివరికి భూమికి చేరుకుంది. ‘ఇది కేవలం ఒక అద్భుత ఆవిష్కరణ మాత్రమే కాదు, మన పొరుగున ఉన్న అంగారక గ్రహం రహస్యాలను తెలుసుకోవడానికి సహాయపడే భారీ డేటాసెట్’ అని సోథెబైస్ సైన్స్ అండ్ నేచురల్ హిస్టరీ వైస్ చైర్మన్ కాసాండ్రా హాటన్ అన్నారు. ఎన్‌డబ్ల్యూ 16788పై భూసంబంధమైన వాతావరణం కనిపిస్తోందని, అన్ని మైళ్ల ప్రయాణం తరువాత కూడా దాని భౌతిక, రసాయన నిర్మాణం చెక్కుచెదరకుండా ఉందని తెలి పారు. అయితే.. వేలం ద్వారా విలువైన పరిశోధనా సామగ్రి ప్రైవేట్ చేతులకు వెళ్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.70 కోట్లు పలికిన హ్యాండ్ బ్యాగ్
పారిస్: అక్కడక్కడా చిరిగిపోయి, మరకలు పడి, బాగా వాడేసిన నల్లని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్. కానీ అది అలాంటిలాంటి బ్యాగ్ కాదు. అలనాటి అందాల హాలీవుడ్ నటి వాడిన బ్యాగ్. ఆ క్రేజ్ వల్లేనేమో, ప్రఖ్యాత ఫ్రెంచ్ నటి దివంగత జేన్ బిర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ ఏకంగా 82 లక్షల డాలర్లకు, అంటే దాదాపు రూ.70 కోట్లకు అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక హ్యాండ్ బ్యాగ్‌కు ఇంతటి ధర పలకడం వేలంపాటల చరిత్రలో ఇదే తొలిసారి. ప్రఖ్యాత సోత్బీ వేలం సంస్థ దీనిని గురువారం ఆన్లైన్లో విక్రయించింది. 10 లక్షల డాలర్ల బిడ్డింగ్‌తో మొదలైన వేలం పాట క్షణాల్లో కోట్లు దాటేసి కొత్త రికార్డ్‌ను కొట్టేసింది. ఎట్టకేలకు జపాన్‌కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఈ బ్యాగును సొంతం చేసుకున్నారు. ఎవరీ బిర్కిన్? తన అందం, అభినయంతో ఫ్రెంచ్ సినిమాలను ఒక ఊపు ఊపిన అలనాటి ప్రఖ్యాత బ్రిటిష్ నటి జేన్ బిర్కిన్. నేపథ్య గాయనిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా, సామాజిక కార్యకర్తగా... ఇలా పనిచేసిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారామె. నాటి సినీ, ఫ్యాషన్ ప్రపంచ ఐకాన్‌గా వెలిగిపోయారు. 1946 డిసెంబర్ 14న లండన్‌లోని మేరీలీబాన్లో జన్మించారు. 76వ ఏట పారిస్‌లో తుదిశ్వాస విడిచారు. హెర్మ్స్ లగ్జరీ వస్తువుల సంస్థ ప్రత్యేకంగా బిర్కిన్ కోసమే 1984లో ఈ బ్యాగును తయారుచేసింది. పారిస్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో బిర్కిన్ పక్క సీటులో హెర్మ్స్ సంస్థ చైర్మన్ జీన్ లూయిస్ డ్యూమస్ ప్రయాణించారు. ‘‘విమానం ఎక్కినప్పుడు వస్తువులు పెట్టుకోవాలంటే వాంతి చేసుకునే కవర్లో పెట్టుకోవాల్సి వస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాండ్ బ్యాగులన్నీ చిన్నగా ఉన్నాయి. అల్లిన బుట్టను వాడడం ఇబ్బందిగా ఉంది. కాస్తంత పెద్ద బ్యాగు తయారు చేయొచ్చుగా!’’ అని అతడిని బిర్కిన్ కోరింది. అడిగిందే తడవుగా సంస్థలోని నిష్ణాతులను పురమాయించి అత్యంత నాణ్యమైన తోలుతో, ప్రత్యేకతలతో పెద్ద బ్యాగ్‌ను తయారు చేయించి 1985లో ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ బ్యాగులను ఇకపై మీ పేరుతో అమ్ముకోవచ్చా అని అడిగితే ఆమె సరేనన్నారు. ఆమె చాన్నాళ్లపాటు అంటే 1985 నుంచి 1994 దాకా రోజూ ఆ బ్యాగును వెంట తీసుకెళ్లేది. అందాల నటి చేతిలో మరింత అందంగా కనిపించిన ఆ బ్యాగుకు ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయింది. తర్వాత మరో నాలుగు బ్యాగులను కూడా కంపెనీ నుంచి ఆమె బహుమతిగా అందుకున్నారు. కానీ ఈ బిర్కిన్ బ్యాగు మాత్రం ఫ్యాషన్ చిహ్నంగా స్ధిరపడింది. దాంతో హెర్మ్స్ తయారీ బిర్కిన్ బ్యాగుల ధర సైతం అమాంతం పెరిగిపోయింది. కేవలం అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలిగే బ్యాగ్‌గా మారిపోయింది.బ్యాగుతో పాటు గోళ్ల కత్తెర బిర్కిన్కు గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం అలవాటు. అందుకే ఆమెకు బహూకరించిన బ్యాగుకు కంపెనీ వెండి గోళ్ల కత్తెరనూ జతచేసింది. జిప్ లాక్ చేయడానికి బుల్లి తాళం కూడా ఇచ్చింది. బ్యాగుకు యూనిసెఫ్, మెడిసిన్స్ డ్యూ మోండే వంటి మానవీయ సంస్థల గుండ్రని స్టిక్కర్లను అతికించారామె. బిర్కిన్ 2023లో చనిపోయారు. అంతకు కొద్ది రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ, ‘నా నటన, గానం, ఫ్యాషన్, సమాజసేవతో పాటు నేను చనిపోయాక నా బ్యాగ్ గురించి కూడా జనం మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో!’ అని అన్నారు. ఆమె ఊహించినట్లే లగ్జరీ వస్తువుల ప్రపంచంలో ఇప్పుడా బ్యాగు ప్రత్యేక స్థానం ఆక్రమించుకుందని సోత్బీ హ్యాండ్‌బ్యాగులు, యాక్సెసరీల గ్లోబల్ హెడ్ మోర్గాన్ హ్యాలిమీ వ్యాఖ్యానించారు. ఒరిజినల్ బ్యాగును ఎయిడ్స్ ఛారిటీ నిధి కోసం వేలం పాట సంస్థకు ఆమె 1994లోనే ఇచ్చేశారు. 2000లో అది మరోసారి వేలానికి వచి్చంది. తర్వాత పాతికేళ్లుగా ఎవరికీ కనిపించలేదు. ఇన్నాళ్లకు సోత్బీ దాన్ని దక్కించుకుని గురువారం ఇలా రికార్డు స్థాయిలో విక్రయించింది. ఈ బ్యాగు మోడల్ అంటే తమకెంతో ఇష్టమని పలువురు సెలెబ్రిటీలు, ఆరి్టస్టులు, స్టైలిస్టులు గతంలో చెప్పారు. -
డైనోసార్ అస్థిపంజరానికి 49 కోట్లు..
కొనుక్కోవాలి అనుకోవాలి గానీ.. మనం రాక్షసబల్లి అస్థిపంజరాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఈ గార్గోసారస్ డైనోసార్ అస్థిపంజరాన్ని రూ.49 కోట్లకు సొంతం చేసుకున్నాడో వ్యక్తి. న్యూయార్క్‌లో సదబీస్ సంస్థ నిర్వహించిన వేలంలో అస్థిపంజరంతోపాటు దానికి పేరుపెట్టే హక్కులు కూడా ఆయనకు లభించాయి. ఇది 7.7 కోట్ల సంవత్సరాల కిందటిదట. ఈ డైనోసార్ 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుంది. ఓ డైనోసార్ అస్థిపంజరం ఇంత ఎక్కువ ధరకు అమ్ముడవ్వడం ఇదే తొలిసారట. అది బతికున్నప్పుడు రెండు టన్నుల బరువు ఉండొచ్చని అంచనా. -
ఖరీదైన ఇళ్లకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: ఖరీదైన ఇళ్ల విభాగం కళకళలాడుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం ఈ విభాగంపై పెద్దగా పడలేదు. రూ.5 కోట్లకు పైగా ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (ధనవంతులు/హెచ్ఎన్ఐలు) 75 శాతం మంది చెప్పారు. వచ్చే రెండేళ్లలో పెద్ద పట్టణాలు, హాలిడే ప్రదేశాల్లో వీరు ఇళ్లను కొనాలనుకుంటున్నారు. లగ్జరీ హౌసింగ్ అవుట్‌లుక్ 2022 పేరుతో లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ఇండియా సోథెబీ ఇంటర్నేషనల్ రియల్టీ ఒక నివేదిక విడుదల చేసింది. 200 హెచ్ఎన్ఐల అభిప్రాయాల ఆధారంగా దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో (హైదరాబాద్ సహా) రియల్ ఎస్టేట్ ధోరణలపై ఈ సంస్థ నివేదిక రూపొందించింది. సంపన్నుల్లో రియల్ఎస్టేట్ పట్ల ధోరణి మారిందనడానికి ఈ ఫలితాలే నిదర్శమని పేర్కొంది. వచ్చే రెండేళ్లలో కొనుగోళ్లకు సముఖంగా ఉన్నామని చెప్పిన 75 శాతం మంది ప్రాధాన్యతలు గమనిస్తే.. 89 శాతం మంది ఖరీదైన ఇళ్ల పట్ల (సిటీ అపార్ట్మెంట్లు, బంగళాలు, హాలిడే హోమ్స్) ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది ఖరీదైన వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. బుల్లిష్ ధోరణి..: ముఖ్యంగా గడిచిన 18 నెలల్లో ఇల్లు కొనుగోలు చేసినట్టు 26% మంది చెప్పారు. వారి జీవనశైలిని మెరుగుపరుచుకోవడం, మంచి పెట్టుబడులను సొంతం చేసుకునే ఆలోచనతోనే వారు కొన్నారు. గత రెండు మూడేళ్లలో హెచ్ఎన్ఐలు, అల్ట్రా హెచ్ఎన్ఐలు ఖరీదైన ఇళ్లను సొంత వినియోగానికే కొనుగోలు చేశారు. మంచి పెట్టుబడి అవకాశం కోసం కొనుగోలు చేయడం అంటే అది బుల్లిష్ ధోరణికి సంకేతమని సోథెబీ ఇంటర్నేషనల్ రియాలిటీ సీఈవో అమిత్ గోయల్ అన్నారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ సంప్రదాయ ధరల పెరుగుదల క్రమంలో ఉన్నట్టు చెప్పారు. హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం 29 శాతం మంది హెచ్ఎన్ఐలు హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ హాలిడే హోమ్‌కు రూ.5–10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని 71 శాతం మంది భావిస్తున్నారు. 29 శాతం మంది రూ.10 కోట్ల పైన ధర ఉన్నా ఫర్వాలేదని చెప్పారు. లగ్జరీ అపార్ట్మెంట్ లేదా విల్లా అయితే రూ.10–25 కోట్ల వరకు పెట్టుబడికి సుముఖంగా ఉన్నట్టు 69 శాతం మంది చెప్పారు. 21 శాతం మంది రూ.5–10 కోట్ల బడ్జెట్లో, మిగిలిన 10 శాతం మంది రూ.25 కోట్లకు పైగా బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు. -
నీలివజ్రం కొత్త రికార్డు!
హాంకాంగ్: వేలం పాటలో ఓ నీలి వజ్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ వజ్రం సోథెబేస్ట్ మార్కెట్లో 205 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి జ్యువెలరీ మార్కెట్లో ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రికార్డును సాధించింది. అలాగే మరో పెయింటింగ్ కూడా వందలకోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. డీబీర్స్ మిలీనియమ్ జ్యువెల్ 4 లో 10.10 క్యారెట్ల గోళాకార ఫాన్సీ వివిద్ బ్లూ డైమండ్... ఆసియాలో మరే ఇతర ఆభరణాల వేలంలోనూ తెచ్చి పెట్టని అత్యధిక డబ్బును తెచ్చిపెట్టిందని ఆక్షన్ హౌస్ వెల్లడించింది. ఆ అరుదైన నీలి వజ్రాన్ని ఓ బిడ్డర్ ఫోన్ ద్వారా వేలంలో కొనుగోలు చేసినట్లు దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనీస్ కళాకారుడు ఝాన్ డాక్వియన్ సృష్టించిన 'పీచ్ బ్లౌజమ్ స్పింగ్' కళాత్మక పెయింటింగ్ .. అసలు ధర 8.3 మిలియన్ డాలర్లు ఉండగా... అంచనాలను అధిగమించి సుమారు 230 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ కళారూపం కేవలం 50 నిమిషాల్లో 100 కంటే ఎక్కువ బిడ్లను పొంది.. షాంఘై లాంగ్ మ్యూజియంకు అత్యంత అధిక ధర పలికింది. ఝాన్ వేసిన ఈ పెయింటింగ్ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారి.