
న్యూయార్క్: పాత భవనాన్ని కూలగొట్టినప్పుడు బయటపడిన పునాది రాయిలా ఉందికదూ. నిజానికి ఇది ఇక్కడి రాయి కాదు. అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి పుడమిపై పడిన అత్యంత అరుదైన శిల ఇది. భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక రాయి ఇదే. దీనిని బుధవారం ప్రఖ్యాత సోత్‌బీ వేలం సంస్థ న్యూయార్క్‌లో వేలంవేయగా ఏకంగా రూ.37 కోట్ల(43 లక్షల డాలర్ల) ధర పలికింది.
38.1 సెంటీమీటర్ల పొడవు, 24.5 కేజీల బరువైన ఈ శిలకు ‘ఎన్‌డబ్ల్యూఏ 16788’ అని పేరు పెట్టారు. 2023 నవంబర్‌లో ఆఫ్రికా ఖండంలోని నైగర్ దేశంలో దీనిని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక చుక్క లేదా గ్రహశకలం భూవాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు భూమి గురుత్వాకర్షణకు లోనవుతాయి. దాంతో తోకచుక్క కొనలోని చిన్నపాటి శిలలు లేదా గ్రహశక లంలోని చిన్న రాతిభాగాలు ఇలా భూమి మీద పడతాయి. అలా అంగారకుని నుంచి వచ్చిన ఒక గ్రహ శకలంలోని చిన్న రాతి ముక్కే ఈ శిల.
‘‘అమెరికాలో పన్నులు, ఇత రత్రా ఖర్చులు కలుపుకుని ఇప్పు డీ రాయిని కొనుగోలుదారు సొంతం చేసుకోవాలంటే ఏకంగా రూ.45.61 కోట్లు చెల్లించుకోక తప్పదు. చరిత్రలో ఇప్పటిదాకా భూమిపై కేవలం 400 అంగారక శిలలే దొరికాయి. అవన్నీ చాలా చిన్నవి. ఇదొక్కటే పెద్దది. అందుకే ఇంత ధర పలికింది. భూ ఉపరితలం 75 శాతం సముద్రజలాలతో నిండి ఉంది. సముద్రంలో పడకుండా సహారా ఎడారిలో పడటం వల్లే మనకు ఇది దొరికింది’’ అని సోత్‌బీ సైన్స్, నేచరల్ హిస్టరీ విభాగ ఉపాధ్యక్షుడు కసాండ్రా హ్యాటన్ చెప్పారు. అయితే ఈ రాయిని కొన్నది ఎవరో సంస్థ బహిర్గతం చేయలేదు. బుధవారం మరెన్నో అరుదైన చారిత్రక వస్తువులను వేలంవేశారు. కోట్ల ఏళ్ల నాటి సెరటాసారస్ డైనోసార్ అస్థిపంజరం రూ.223 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం