ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: విదేశాలపై సుంకాల భారం మోపడం వల్లే దేశాదాయం విపరీతంగా పెరిగిందని, తద్వారా సమకూరిన ఆదాయం నుంచి అర్హులైన అమెరికన్లకు సుంకాల డివిడెండ్‌గా 2,000 డాలర్లు పంపిణీ చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ప్రకటించారు. విదేశాలపై సుంకాలను ఇష్టారీతిగా పెంచే విచక్షణాధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుందా? అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాలు అధ్యక్షుడికి వర్తిస్తాయా? అనే అంశాలపై సుప్రీంకోర్టు లోతైన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ట్రంప్ ఆదివారం ఈ మేరకు తనదైన రీతిలో స్పందించారు.
సొంత సామాజిక మాధ్యమ ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘సుంకాలను వ్యతిరేకించే వాళ్లంతా మూర్ఖులు. అధిక సుంకాలతో రెవిన్యూ వసూళ్ల వరద మొదలయ్యాక మనం అత్యంత ధనిక, గౌరవప్రద దేశంగా మారాం. మన దగ్గర ద్రవ్యోల్బణం దాదాపు లేదు. స్టాక్‌మార్కెట్ దూసుకుపోతోంది. ట్రిలియన్ల డాలర్లు వచ్చిపడుతున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల అప్పులను తీర్చే ప్రక్రియ మొదలెడతా. అమెరికాలోకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. దాదాపు మిగతా వాళ్లందరికీ సుంకాల డివిడెండ్‌గా 2,000 డాలర్లు నేరుగా బదిలీచేస్తా’’ అనిట్రంప్ అన్నారు.


