కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో | Paraglider Dangles 60 Metres In Air After Getting Stuck On Crane In China | Sakshi
Sakshi News home page

కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో

Jun 21 2026 7:15 PM | Updated on Jun 21 2026 7:22 PM

Paraglider Dangles 60 Metres In Air After Getting Stuck On Crane In China

బీజింగ్‌: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో బలమైన గాలుల వల్ల నియంత్రణ కోల్పోయిన ఓ పారాగ్లైడింగ్ పైలట్ 60 మీటర్ల ఎత్తైన టవర్ క్రేన్‌కు చిక్కుకుని నిలిచిపోయాడు. పారాగ్లైడర్‌తో అతడు నాన్‌చోంగ్ నగరం వైపు దిగుతున్న సమయంలో గ్లైడర్ తాళ్లు క్రేన్ జిబ్‌కు చిక్కుకున్నాయి. ఆ భయానక దృశ్యం కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో వీబో వంటి సోషల్ మీడియా వేదికల్లో, ఎక్స్‌లో వైరల్‌ అయింది.

అత్యంత ఎత్తులో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ఎట్టకేలకు పారాగ్లైడర్‌ను సురక్షితంగా కాపాడారు. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. పైలట్ కొన్ని గంటలసేపు చిక్కుకుపోయాడు. కొన్ని స్థానిక మీడియా సంస్థలు మాత్రం సహాయక చర్యలకు కొన్ని గంటలు పట్టాయని తెలిపాయి. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఈ ఘటన సాహస క్రీడల భద్రతపై పెరుగుతున్న ఆందోళనను స్పష్టం చేస్తోంది. పారాగ్లైడింగ్‌కు ముందస్తు అనుమతి తీసుకోవాలి. వాతావరణ పరిస్థితులు, గగనతల నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఊహించని విధంగా వీచే గాలులతో పాటు పట్టణ ప్రాంతాల్లోని భారీ నిర్మాణాలు కూడా ప్రమాదానికి దారితీయవచ్చని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.

ఇటీవల ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో మరో ఘటన కూడా ఈ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ చిన్న విమానం పారాగ్లైడర్‌ను ఢీకొట్టింది. ఆ దెబ్బకు పారాగ్లైడర్ వేగంగా తిరుగుతూ నేలవైపు దూసుకెళ్లింది. చివరి క్షణంలో ఆమె అత్యవసర పారాచూట్‌ను తెరిచి సురక్షితంగా దిగగలిగింది. ఆ ఘటన మే నెలలో ఉత్తర ఆస్ట్రియాలోని ష్మిట్టెన్‌హోహే పర్వతం సమీపంలో జరిగింది. ఈ ప్రాంతం పారాగ్లైడింగ్‌కు ప్రసిద్ధి పొందింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement