అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్‌లో సామాన్యులకు తిండి తిప్పలు తప్పడం లేదు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ విధానాల లోపం కారణంగా పాకిస్తాన్‌లో గోధుమ పిండి సంక్షోభం అత్యంత తీవ్రమైంది. ఆ దేశంలోని దక్షిణ పంజాబ్ ప్రాంతంలో మొదలైన ఈ సంక్షోభంతో పేద ప్రజలు రెండు పూటల కూడా తిండి తినలేని పరిస్థితి నెలకొంది.
ప్రాంతీయ బహిరంగ మార్కెట్లలో గోధుమ ధరలు 40 కిలోలకు రూ.4,600 (పాకిస్తాన్ రూపాయలు) చేరగా, ఒక్క కేజీ గోధుమ పిండి దాదాపు రూ.130 లకు చేరింది. అంటే, ఒక సామాన్య కుటుంబం 10 కిలోల పిండి కోసం రూ.1,300 ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేదలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది.
మరోవైపు అక్కడి ప్రభుత్వం సబ్సిడీతో పిండి అందిస్తున్నా దాంతో సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. 10 కిలోల పిండి కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.910 కాగా 20 కిలోలకు రూ.1,820. అయితే లాహోర్ వెలుపల ప్రభుత్వ పిండి లభ్యత చాలా తక్కువగా ఉంది. దక్షిణ పంజాబ్ ప్రజలు ఇప్పుడు ఖరీదైన బ్రాండెడ్ పిండిపై ఆధారపడాల్సి వస్తోంది.
పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం.. వ్యాపారులు, సామాన్య ప్రజల వద్ద గోధుమ నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. సుమారు 50 లక్షల జనాభా ఉన్న రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో ప్రభుత్వ గోధుమల స్థిర కోటా అందుబాటులో లేకపోవడం వల్ల సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. గత రెండు సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో 80 శాతం పిండి మిల్లులు నష్టాల్లో నడుస్తున్నాయని మిల్లర్లు తెలిపారు.
పెరుగుతున్న ఖర్చులు, బలహీన పంపిణీ వ్యవస్థ, ప్రభుత్వ ఉదాసీనత పరిస్థితిని మరింత తీవ్రముగా మార్చాయని మిల్లర్లు చెబుతున్నారు. పంజాబ్ ప్రభుత్వం తన 1.5 మిలియన్ టన్నుల నిల్వల నుండి జనవరి 20 నుండి మార్చి 20 వరకు రోజుకు 20,000–22,000 టన్నుల గోధుమలు విడుదల చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, ఈ సంక్షోభం మరింత తీవ్రం కావచ్చని హెచ్చరించారు.


