‘మోదీని మాకు ఇవ్వండి’.. ఓ పాకిస్థానీ ఆవేదన.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Pak Man Comments Viral On India PM Modi Leadership - Sakshi

ఇస్లామాబాద్‌: మోదీ పాలనలో బతికేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఆయన చెడ్డ వ్యక్తి ఎంత మాత్రం కాదు. గొప్ప మనిషి. భారతీయులు ఇవాళ అర్ధరాత్రిళ్లు సైతం పిల్లల ఆకలి తీర్చే స్థితిలో ఉన్నారు. నిత్యావసరాలు అందుబాటు ధరలో కొనుగోలు చేసుకుంటున్నారు. మనం అలాంటి స్థితిలో లేనప్పుడే.. పుట్టిన దేశాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాం అంటూ ఓ పాక్‌ పౌరుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బీజేపీ నేతలతో పాటు మోదీ అభిమానులు వాటిని తెగ వైరల్‌ చేస్తున్నారు.

పాక్‌లోని పలు ప్రముఖ ఛానెల్స్‌లో పని చేసిన మాజీ జర్నలిస్ట్‌, యూట్యూబర్‌ సనా అంజాద్‌.. తాజాగా ‘బతికేందుకు పాక్‌ నుంచి పారిపోండి.. అది భారత్‌లో ఆశ్రయం పొందైనా సరే!’ పేరిట.. ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా ఆమె.. వీధుల్లో తిరుగుతూ అక్కడి పౌరుల స్పందన కోరుతూ వస్తున్నారు. అలా ఓ యువకుడు మాట్లాడిన వీడియోనే ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. 

‘‘అసలు పాక్‌ భారత్‌ నుంచి విడిపోవాల్సింది కాదు. అలా జరగకపోయి ఉంటే.. ఇప్పుడు మనం(పాక్‌ ప్రజలను ఉద్దేశించి) అందుబాటు ధరల్లోనే అన్నీ కొనుక్కునేవాళ్లం. పేరుకే మనది ఇస్లాం దేశం. కానీ, ఇస్లాం స్థాపన మాత్రం ఇక్కడ జరగలేదు.  మనకన్నా భారత ప్రధాని మోదీ ఎంతో నయం. ఆయన్ని అక్కడి ప్రజలు ఎంతో గౌరవిస్తారు. ఒకవేళ మనకే గనుక మోదీ ఉండి ఉంటే.. మనకు ఏ నవాజ్‌ షరీఫ్‌లు, బెనజీర్‌ భుట్టోలు, ఇమ్రాన్‌ ఖాన్‌లు, ముష్రాఫ్‌లు అవసరం ఉండేవాళ్లు కాదు. ఆయనొక్కడు చాలూ.. దేశంలోని అన్ని సమస్యలను చక్కబెట్టేవారు. ప్రస్తుతం ఆ దేశం(భారత్‌) ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉంది. మరి మనం ఎక్కడ ఉన్నాం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడా పాక్‌ పౌరుడు. 

మన దేశానికి మోదీని ఇవ్వమని, ఆయన మన దేశాన్ని పాలించాలని నేను అల్లాని ప్రార్థిస్తాను అని చివర్లో సదరు యువకుడు భావోద్వేగంగా చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. అల్లా.. మోదీని మాకు ఇవ్వండి. ఆయన దేశాన్ని బాగు చేస్తారు అంటూ ఆవేదనగా మాట్లాడాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే.. పాక్‌లో ప్రస్తుతం దారుణమైన ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. ఇమ్రాన్‌ ఖాన్‌ హయాంలో మొదలైన సంక్షోభం.. షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంలో తారాస్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో తీవ్ర ప్రజావ్యతిరేకత కనిపిస్తోంది. అయితే సనా అంజాద్‌ చేసిన కార్యక్రమంలో.. భారత ప్రధాని మోదీ నాయకత్వంపై పలువురు పాక్‌ ప్రజలు ప్రశంసలు గుప్పించగా.. మరికొందరు మాత్రం ఈ రెండు దేశాలను, వాటి పరిస్థితులను పోల్చడం సరికాదంటూ వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top