
గాజాలో 85 మంది మృతి
గాజా: గాజా స్ట్రిప్‌లో మారణహోమం కొనసాగుతూనే ఉంది. ఆహారం, మానవతా సాయం కోసం అల్లాడుతున్న సామాన్య పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంటోంది. ఆదివారం ఇజ్రాయెల్ జవాన్ల కాల్పుల్లో కనీసం 85 మంది మరణించారు. ఇజ్రాయెల్ భూభాగం నుంచి జికిమ్ క్రాసింగ్ ద్వారా ఉత్తర గాజాలోకి ప్రవేశించిన వాహనాల వద్దకు జనం పరుగెత్తుకొని వస్తుండగా ఇజ్రాయెల్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో 79 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 150 మంది గాయపడ్డారు.
వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వాహనాల్లో చేరవేస్తున్న ఆహారం కోసం జనం ఆరాటపడగా, చివరకు ప్రాణాలే పోయాయి. దక్షిణ గాజాలో జరిగిన కాల్పుల్లో మరో ఆరుగురు బలయ్యారు. సెంట్రల్ గాజా నుంచి జనం బయటకు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ మిలటరీ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఖతార్‌లో చర్చలు కొనసాగుతుండగానే ఈ హెచ్చరికలు వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదని మధ్యవర్తులు చెబుతున్నారు.