విండోపవర్‌ | New Perovskite Solar Cells Turn Glass Windows Into Power | Sakshi
Sakshi News home page

విండోపవర్‌

Jun 5 2026 3:17 AM | Updated on Jun 5 2026 4:27 AM

New Perovskite Solar Cells Turn Glass Windows Into Power

మీ ఇంట్లో కిటికీల సంఖ్యను రెట్టింపు చేసుకోండి 
వీలైతే మీ భవనాలను అద్దాలతో కప్పేసుకోండి 
ఎందుకంటే.. ఇంకొన్ని ఏళ్లలో ఈ కిటికీలు, అద్దాలే విద్యుదుత్పత్తి కేంద్రాలు కానున్నాయి మరి! 
సూర్యుడి వెలుతురును అడ్డుకోకుండానే విద్యుత్తును అందించడం వీటి ప్రత్యేకత. అదెలాగంటే...

సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (ఎన్‌టీయూ) సరికొత్త సోలార్‌ సెల్స్‌ను ఆవిష్కరించింది. అత్యంత పలుచగా ఉండటమే కాకుండా పెరోవిస్కైట్‌ అనే పదార్థంతో తయారైన ఈ సోలార్‌ సెల్స్‌ను నేరుగా కిటికీలు, అద్దాలపై ఏర్పాటు చేసకోవచ్చు. వెలుతురును కూడా ప్రసారం చేయగల ఈ అర్ధ పారదర్శక సోలార్‌ సెల్స్‌ రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేయగలవు.  ప్రస్తుతం సోలార్‌ సెల్స్‌ సిలికాన్‌తో తయారవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే సిలికాన్‌ ఖరీదు చాలా ఎక్కువ. సామర్థ్యం విషయంలోనూ పరిమితులున్నాయి. 

బిగించుకోవడం, వాడుకోవడంలోనూ ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలో చౌక, మరింత సమర్థమైన సోలార్‌సెల్స్‌ తయారీకి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సుమారు రెండు దశాబ్దాల క్రితం పెరోవిసై్కట్‌ను ప్రత్యామ్నాయంగా గుర్తించారు. కాకపోతే అప్పట్లో వీటి సామర్థ్యం చాలా తక్కువగా అంటే కాంతి రూపంలో పడే శక్తిలో కేవలం రెండు శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలిగేది. తరువాతి కాలంలో జరిగిన పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ సామర్థ్యం 20 శాతానికి చేరుకోవడం గమనార్హం. 

వెలుతురు, విద్యుత్తుల బ్యాలెన్స్‌... 
ఎన్‌టీయూ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన సరికొత్త పెరోవిస్కైట్‌ సోలార్‌ సెల్స్‌ ఎంత మందం ఉంటాయో తెలుసా? కేవలం పది నానోమీటర్లు. అంటే మనిషి వెంట్రుక కంటే పది వేల రెట్లు తక్కువ మందం అన్నమాట. పైగా ఈ సెల్స్‌పై పడే కాంతిలో 41 శాతం నేరుగా ప్రసారమయ్యేంత పారదర్శకంగా ఉంటాయి. అయితే ఇలా పారదర్శకంగా ఉంచేందుకు దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం విషయంలో కొంత రాజీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సోలార్‌ సెల్స్‌ 7.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. 

కాకపోతే చౌక కాబట్టి భవనాలను వీటితో కప్పేసి సిలికాల్‌ సోలార్‌ సెల్స్‌ కంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ చూద్దాం.. న్యూయార్క్‌లో వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ అనే ఓ భారీ భవనముంది. ఈ ఒక్క భవనాన్ని ఎన్‌టీయూ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవిసై్కట్‌ సోలార్‌ సెల్స్‌ తో కప్పేస్తే వందల మెగా వాట్‌/గంటల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత విద్యుత్తుతో అమెరికాలో 40 వరకూ ఇండ్ల అవసరాలు తీర్చవచ్చునని అంచనా.  

సవాళ్లూ లేకపోలేదు... 
పెరోవిసై్కట్‌ సోలార్‌ సెల్స్‌తో ఎన్‌టీయూ శాస్త్రవేత్తలు సరికొత్త అద్భుతాన్ని సృష్టించినప్పటికీ వీటిని విస్తృత స్థాయిలో వాడే విషయంలో కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇవి ఎంతకాలం మన్నుతాయి అన్నది. సిలికాన్‌ సోలార్‌ సెల్స్‌ సగటు ఆయుష్షు సుమారు 25 ఏళ్లు. అయితే పెరోవిసై్కట్‌ పదార్థానికి తడి తగిలితే సరిగ్గా పనిచేయవు. ఆక్సిజన్, వేడి, అతినీలలోహిత కిరణాలను తట్టుకోవడం కష్టం.

 అందువల్ల వీటి దీర్ఘకాలిక మన్నికపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే వాహనాల పైకప్పులపై వీటిని వాడుకోవడం ద్వారా బ్యాటరీలను నిత్యం ఛార్జ్‌ చేసుకుంటూ ఉండవచ్చు. అలాగే స్మార్ట్‌ గ్లాసెస్, తొడుక్కునే ఎలక్ట్రానిక్స్‌ వంటివి పదే పదే ఛార్జ్‌ చేసుకునే అవసరం తప్పుతుంది. ప్రస్తుతం ఈ సోలార్‌ సెల్స్‌పై ఎన్‌టీయూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలతో చర్చలూ జరుపుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే కొన్నేళ్లలోనే ఇవి మన ఇంటి కిటికీలపైకి చేరవచ్చు. 

పెరుగుతున్న ప్రాధాన్యం... 
2009లో జపనీస్‌ శాస్త్రవేత్త సుటోము మియాసాకా పెరోవిస్కైట్‌ను సోలార్‌ సెల్స్‌ తయారీకి వాడవచ్చునని గుర్తించారు. అప్పటి నుంచి దీని ప్రాధాన్యం ఏటికేడాదీ పెరుగుతూ వస్తోంది. 2012 – 13 కల్లా పెరోవిసై్కట్‌ సోలార్‌ సెల్స్‌ సామర్థ్యం పది శాతానికి చేరింది. 2015 నాటికి 20 శాతం సామర్థ్యంతో సిలికాన్‌తో సరి సమానమైంది. మరో ఐదేళ్లకు సిలికాన్‌ – పెరోవిస్కైట్‌ సోలార్‌ సెల్స్‌ సామర్థ్యం 30 శాతానికి, తాజాగా టాండెమ్‌ పెరోవిసై్కట్‌ – సిలికాన్‌ మాడ్యూల్స్‌ 35 శాతానికి చేరుకుంది. అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో ఈ సోలార్‌ సెల్స్‌ పైలెట్‌ స్థాయి ప్రాజెక్టులు నడుపుతూండటం గమనార్హం. 

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement