ఫ్యూచర్‌ సిటీకి సింగపూర్‌ మాస్టర్‌ప్లాన్‌! | Singapore master plan for city of the future | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ సిటీకి సింగపూర్‌ మాస్టర్‌ప్లాన్‌!

Jun 12 2026 3:36 AM | Updated on Jun 12 2026 3:36 AM

Singapore master plan for city of the future

డీపీ ఆర్కిటెక్ట్స్‌తో ఎఫ్‌సీడీఏ ఒప్పందం 

9 నెలల్లో బృహత్తర ప్రణాళిక సిద్ధం! 

తొలుత 13 వేల ఎకరాల ప్రాధాన్యత జోన్‌కే ప్లాన్‌ 

మూడు విభిన్నమైన జోన్లు కలిపేలా రూపకల్పన

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రతిపాదిత భారత్‌ ఫ్యూచర్‌ సిటీ (బీఎఫ్‌సీ) అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 765 చదరపు కిలోమీటర్ల (చ.కి.మీ) మేర విస్తరించి ఉన్న ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి సంబంధించిన బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) రూపకల్పన బాధ్యతను సింగపూర్‌కు చెందిన బహుళ జాతి ఆర్కిటెక్చరల్‌ డిజైనింగ్‌ కంపెనీ డీపీ ఆర్కిటెక్ట్స్‌ దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మాస్టర్‌ ప్లాన్‌ టెండర్ల ప్రక్రియలో మొత్తం ఆరు అంతర్జాతీయ సంస్థలు పోటీ పడగా.. తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అందించేందుకు (లోయెస్ట్‌ బిడ్డర్‌) ముందుకు రావడంతో ’డీపీ ఆర్కిటెక్ట్స్‌’ సంస్థను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఎఫ్‌సీడీఏ కార్యాలయంలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో డీపీ ఆర్కిటెక్ట్స్‌ సంస్థ ప్రతినిధులకు అధికారులు ఒప్పంద పత్రాలను అందజేశారు. 9 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ పూర్తి చేయాలని సింగపూర్‌ సంస్థకు ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని విధించింది. 

తొలుత 13 వేల ఎకరాలకే.. 
ఏ నగరాభివృద్ధికైనా సమగ్ర ప్రణాళిక అవసరం. లేకుంటే అస్తవ్యస్తమైన వృద్ధి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు అధికార పరిధి సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో మొత్తం 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎఫ్‌సీడీఏ పరిధిలో భూవినియోగం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అయితే తొలి దశలో సుమారు 13 వేల ఎకరాలను అత్యంత ప్రాధాన్యత కలిగిన జోన్‌గా గుర్తించి ముందస్తుగా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించనున్నారు. రాబోయే కాలంలో ఈ మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా హైదరాబాద్‌ శివార్లలో ఇంండ్రస్టియల్, ఐటీ, ఏఐ, గ్రీన్‌ ఎనర్జీ హబ్‌లతో కూడిన సరికొత్త నాల్గవ నగరం రూపుదిద్దుకోనుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌కు 4 వేల ఎకరాలు, రెసిడెన్షియల్‌ జోన్‌కు 2,477 ఎకరాలు, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌కు 2,177 ఎకరాలు, ఈవీ అండ్‌ ఎనర్జీ పార్క్‌కు 1,976 ఎకరాలు, హెల్త్‌ సిటీకి 594 ఎకరాలు, ఏఐ సిటీకి 403 ఎకరాలు, డేటా సెంటర్‌ హబ్‌కు 313 ఎకరాలు, ఎడ్యుకేషన్‌ అండ్‌ యూనివర్సిటీ జోన్‌కు 255 ఎకరాలు కేటాయించారు. 

3 విభిన్న ప్రాంతాలతో.. 
మూడు విభిన్న ప్రాంతాల కలయికతో కూడిన ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ సమగ్ర సమత్యులతో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 
ఉత్తర ప్రాంతం: హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ 2031 పరిధితో ఇది కలిసి ఉంటుంది. ఇక్కడ రవాణా నెట్‌వర్క్‌లు, కారిడార్లు ఇప్పటికే ఉన్నాయి. 
మధ్య ప్రాంతం: హైదరాబాద్‌ ఫార్మా సిటీ భూమి దీని పరిధిలో ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో లైఫ్‌ సైన్సెస్, ఎల్రక్టానిక్స్‌ రంగాలు అభివృద్ధి చేయనున్నారు. 
దక్షిణ ప్రాంతం: ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీనికి ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధమైన భూవినియోగ ప్రణాళిక లేదు. ఈ మూడు భిన్నమైన జోన్లను కలుపుతూ, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ ఫ్రేమ్‌వర్క్‌కు సరిపోయేలా ఒకే చట్టబద్ధమైన మాస్టర్‌ ప్లాన్‌ అత్యవసరమని సింగపూర్‌ సంస్థకు అధికారులు స్పష్టం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement