రేపు సింగపూర్‌కు చంద్రబాబు | Chandrababu Naidu to visit Singapore for two days | Sakshi
Sakshi News home page

రేపు సింగపూర్‌కు చంద్రబాబు

Jun 14 2026 5:25 AM | Updated on Jun 14 2026 5:25 AM

Chandrababu Naidu to visit Singapore for two days

15, 16 తేదీల్లో రెండు రోజుల పర్యటన

సాక్షి, అమరావతి:  ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులపాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి సీఎం సింగపూర్‌ బయలుదేరి వెళ్లనున్నారు. సింగపూర్‌ కాలమానం ప్రకారం సోమ­వారం ఉదయం 10.30 గంటలకు ఆ దేశంలోని భారత హై కమిషనర్‌ శిల్పక్‌ అంబులేతో సమావేశం అవుతారు. పర్యటనలో తొలిరోజు స్టార్టప్‌ వెంచర్‌ కాపిటలిస్టులతో జరిగే రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్సుకు హాజరవుతారు. అనంతరం యూఎన్‌ హాబిటాట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనాక్లాడియా రాస్‌ బాచ్‌తో విందు సమావేశంలో పాల్గొంటారు.

సింగపూర్‌ సీనియర్‌ మంత్రి లో యెన్‌ సింగ్‌తో సీఎం సమావేశమవుతారు. తర్వాత గూగుల్‌ క్లౌడ్‌ ఏపీ అధ్యక్షుడు కరణ్‌ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అడ్వైజర్‌ లిమ్‌ సియాంగ్‌ గౌన్‌తో చర్చిస్తారు. వైసీహెచ్‌ లాజిస్టిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ రాబర్ట్‌ యాప్‌తోనూ, నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సింగపూర్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ టాన్‌ యెంగ్‌ చెయ్‌తోనూ భేటీ అవుతారు. సింగపూర్‌ ప్రధానమంత్రి లారెన్స్‌ వాంగ్‌తోనూ పలు అంశాలపై చంద్రబాబు చర్చిస్తారు. సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో భేటీ అవుతారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి బృందంతో కూడా సమావేశమవుతారు. 

సింగపూర్‌ హోం మంత్రి కె.షణ్ముగ, మానవ వనరుల శాఖ మంత్రి టాన్‌ సీ లెంగ్‌తో చివరిగా భేటీ అవుతారు. మంగళవారం ఉదయం కాకతీయ కల్చరల్‌ అసోసియేషన్‌ సీబీఎన్‌–361ను సీఎం ప్రారంభిస్తారు. ఏపీఏసీ సెమీకండక్టర్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్‌–అమరావతి ప్లానింగ్‌ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్‌ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్‌ కిమ్‌ యాంగ్‌ బృందంతో సమావేశమవుతారు. 

తర్వాత ‘వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌’ లీడర్‌షిప్‌ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. సీట్రియమ్‌ సమావేశంలోనూ పాల్గొంటారు. పర్యటనలో చివరిగా సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌– 2026 బిజినెస్‌ రోడ్‌ షోలో పాల్గొంటారు. సీఎం వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌ కుమార్, ఈడీబీ సీఈఓ షణ్మోహన్, సీఆర్డీఏ అధికారుల బృందం కూడా సింగపూర్‌ వెళ్లనుంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement