
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది. అయితే ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. ఆ దాడికి వ్యూహ రచన చేసింది పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆజ్మా బుఖారీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. పాక్ సైన్యం.. భారత్‌పై ఎలా దాడి చేయాలనే ప్లాన్ మొత్తం నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదు.. ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది’ అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు.
ఇటీవల భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌లో బీభత్సం సృష్టించింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. వాళ్లకు శిక్షణ ఇచ్చే స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్.. భారత్‌పై మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి ప్రయత్నించింది. అయినప్పటికీ భారత్ శక్తి, యుక్తులు ముందు అవి తేలిపోయాయి.
దీంతో పాకిస్తాన్ సైన్యంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆజ్మా బుఖారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.