ఐఎస్‌ఎస్‌ను సముద్రంలో ముంచేస్తారా?  | NASA plans to crash the ISS into the Pacific Ocean | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎస్‌ను సముద్రంలో ముంచేస్తారా? 

Jun 25 2026 1:15 AM | Updated on Jun 25 2026 1:15 AM

NASA plans to crash the ISS into the Pacific Ocean

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను సముద్రంలో కూల్చేయనున్నారా? సుమారు ముప్పై ఏళ్లుగా పలు శాస్త్ర పరిశోధనలకు వేదికగా నిలిచిన ఈ భారీ అంతరిక్ష కేంద్రం ఇక గత చరిత్ర కానుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అవునని అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా). అయితే వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఐఎస్‌ఎస్‌ను కూల్చాల్సిన అవసరమేమొచ్చింది? భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని ఈ 450 టన్నుల బరువైన కేంద్రాన్ని సముద్రంలో కూల్చేస్తే ప్రమాదమేమీ లేదా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో... 

ఎప్పుడో 1998లో రష్యా మొదలుపెట్టిన ఐఎస్‌ ఎస్‌ నిర్మాణం అమెరికాతోపాటు అనేక ఇతర దేశాల భాగస్వామ్యంతో 2000లో పూర్తయింది. ఆ తరువాత దశల వారీగా ఒక్కో పరిశోధన కేంద్రాన్ని జోడించుకుంటూ విస్తరించింది. మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా అందులో అనేకానేక ముఖ్యమైన ప్రయోగాలు జరిగాయి. 

వైద్యం, అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో పంటలెలా పండుతాయి? పదార్థాల ధర్మాలు ఎలా మారతాయి? అన్న విషయాలతోపాటు భూమిని నిత్యం పరిశీలించేందుకు కూడా ఐఎస్‌ఎస్‌ ఎంతో ఉపయోగపడింది. అయితే 1998లో తొలి మాడ్యూల్‌ను ప్రారంభించినçప్పుడు ఐఎస్‌ఎస్‌ వయసు 15 ఏళ్లు మాత్రమే అని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఇది అంతకు రెట్టింపు సమయం సేవలందించింది. ఫలితంగా ఈ నిర్మాణం అంత సురక్షితమైంది కాదన్న అంచనాలు ఉన్నాయి. పైగా మరమ్మతు చేయడం మరింత భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలోనే 2030 నాటికల్లా ఐఎస్‌ఎస్‌ను నెమ్మదిగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి సముద్రంలో కూల్చేయాలని నాసా ప్రతిపాదిస్తోంది.  

ఉపగ్రహ శ్మశానంలో... 
ఐఎస్‌ఎస్‌ ఒక చివర నుంచి ఇంకో చివర వరకూ ఉన్న దూరం సుమారు 358 అడుగులు. వెడల్పు 239 అడుగులు. ఎత్తు 66 అడుగులు. ఇంత భారీ సైజున్న ఐఎస్‌ఎస్‌ను కూల్చేయడం అంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పొరబాటున జనావాసాలున్న చోట కూలితే ఇక అంతే సంగతులు. అందుకే నాసా దీన్ని పాయింట్‌ నీమో వద్ద సముద్రంలో పడేలా చేస్తామంటోంది. కాలం చెల్లిన, అదుపు తప్పిన ఉపగ్రహాలన్నింటినీ కూల్చే ప్రాంతమే ఈ పాయింట్‌ నీమో. 

పసిఫిక్‌ మహాసముద్రం దక్షిణ భాగంలో న్యూజిల్యాండ్, దక్షిణ అమెరికాల మధ్య ఉంటుంది ఇది. అక్కడి నుంచి కనీసం 2,688 కిలోమీటర్ల దూరం వెళితే గానీ మనిషి అన్నవాడు కనిపించడు. పైగా ఈ ప్రాంతలో నౌకలు తిరిగేది కూడా చాలా తక్కువ. ఐఎస్‌ఎస్‌కు వెళ్లి వచ్చే వ్యోమగాములు కూడా ఈ ప్రాంతంలోనే భూమ్మీదకు చేరుతూంటారు. ఒకవేళ అనుకోని విధంగా ఐఎస్‌ఎస్‌ ముక్కలు ముక్కలైనా ఈ నిర్మానుష్య సముద్ర ప్రాంతంలో పడటం వల్ల ఎవరికీ అపాయం జరగదన్న అంచనాతో నాసా దీన్ని ఎంచుకుందన్నమాట. 

పర్యావరణవేత్తల ఆందోళన... 
ముందుగా చెప్పుకున్నట్లు ఐఎస్‌ఎస్‌ బరువు సుమారు 450 టన్నులు. రకరకాల లోహాలు, ప్లాస్టిక్‌ పదార్థాలతో తయారైంది. అంతేకాకుండా... బోలెడన్ని రసాయన అవశేషాలు కూడా ఉంటాయి దీంట్లో. ఇవన్నీ పర్యావరణానికి ముఖ్యంగా సముద్ర జలచరాలకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఐఎస్‌ఎస్‌ను పాయింట్‌ నీమో వద్ద కూల్చాలన్న ప్రతిపాదనపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రాన్ని వ్యర్థాలను పడేసే చెత్తకుప్ప మాదిరిగా చూడొద్దని శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు.

 మొత్తంగా కూల్చేయడం కంటే... ఐఎస్‌ఎస్‌లో పనికొచ్చే వ్యవస్థలు, ఇంజిన్లు, మోటార్లను అక్కడే మరమ్మతు చేసి వాడుకోవాలని... ఎలాగైతే ఒక్కో భాగాన్ని జోడించి ఐఎస్‌ఎస్‌ను సిద్ధం చేశారో.. అదే పద్ధతిలో దశలవారీగా విడగొట్టి అత్యవసరం అనుకున్న భాగాలను మాత్రమే కూల్చేయాలని సూచిస్తున్నారు. శకలాల కారణంగా ఏ దేశానికైనా నష్టం జరిగితే ఆ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం పరిహారం చెల్లించాలని 1972 నాటి స్పేస్‌ లయబిలిటీ కన్వెన్షన్‌ చెబుతోందని, దురదృష్టవశాత్తూ ఈ నియమం సముద్రాలకు వర్తించదని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ద ఓషన్‌ ఫౌండేషన్‌’అధ్యక్షుడు మార్క్‌ స్పేడ్‌లింగ్‌ చెబుతున్నారు. ఈ లోటును భర్తీ చేయాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు. మనుషులకు దూరంగా కూల్చేస్తున్నారని చెప్పుకుంటున్నా.. ఆ ప్రాంతానికీ ఎంతో కొంత విలువ ఉంటుందన్నది గుర్తించాలని చెబుతున్నారు. చూద్దాం ఏమవుతుందో? 

ఎలా కూలుస్తారంటే... 
→ 2028లో ఐఎస్‌ఎస్‌ కూల్చివేత ప్రక్రియ మొదలవుతుంది. ఐఎస్‌ఎస్‌కు వెన్నెముక లాంటి జార్యా (రష్యా మాడ్యూల్‌) కక్ష్యను క్రమ పద్ధతిలో తగ్గిస్తారు. భూమి సహజ ఆకర్షణ శక్తికి గురయ్యేలా చేస్తారు.  

→ 2029లో స్పేస్‌ ఎక్స్‌కు చెందిన డీ ఆర్బిటింగ్‌ అంతరిక్ష నౌక ఒకటి ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమవుతుంది. సుమా రు 46 థ్రస్టర్లను ఉపయోగించి నియంత్రిత పద్ధతిలో ఐఎస్‌ఎస్‌ను పాయింట్‌ నిమోకు చేరుస్తుంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement