
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 రాచెల్ గుప్తాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె తన టైటిల్‌ను వదులుకుంటున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఈలోపు నిర్వాహకులే ఆమెను టైటిల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.
న్యూఢిల్లీ/బ్యాంకాక్: ఇండియన్ మోడల్ రాచెల్ గుప్తా(Rachel Gupta) ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేశారు. విషపూరితమైన వాతావరణంలో తాను ఇంతకాలం ఉన్నానని, ఇక మౌనంగా భరించడం తన వల్ల కాదని, రాజీనామా నిర్ణయం కష్టమే అయినా తప్పట్లేదని, ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వాళ్లను నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించాలని ఓ పోస్ట్ చేశారు. ‘‘‘వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి’’ అంటూ త్వరలో ఓ వీడియో ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తానని అన్నారామె.
అయితే ఈలోపు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) నిర్వాహకులు ఆమె పోస్టునకు పూర్తి విరుద్ధంగా స్పందించారు. గుప్తాను అధికారికంగా తొలగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆమె తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని, సొంత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇచ్చారని, గ్వాటెమాలా అధికారిక పర్యటనకు నిరాకరించార’’ని పేర్కొంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను తొలగిస్తున్నామని, 30 రోజుల్లో కిరీటం తమ కార్యాలయంలో అప్పగించాలని ఆమెను ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. ఫిలిప్పీన్స్‌కి చెందిన సీజే ఓపియాజాకు కిరీటం వెళ్లే అవకాశాలు ఉన్నాయి
పంజాబ్ జలంధర్‌కు చెందిన 21 ఏళ్ల రాచెల్ గుప్తా కిందటి ఏడాది ఆగష్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ దక్కించుకుంది. ఆపై అక్టోబర్ 25వ తేదీ బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో 70 దేశాలకు చెందిన అందెగత్తెలను వెనక్కినెట్టి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెల్చుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సుందరిగా ఘనతకెక్కింది.
ఇదీ చదవండి: తప్పతాగాడు.. టేబుల్ ఎక్కి నన్ను డ్యాన్స్ చేయమన్నాడు