
పుడమి కంటే ముందే పుట్టిన అంతరిక్ష శిల అమెరికాలో పడిన వైనం
అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించిన ఖగోళ శాస్త్రవేత్తలు
ఇంటికి అతిథిగా చిన్ననాటి స్నేహితులు, ఆప్తులు వస్తే ఎంతో ఆత్మీయంగా, సాదరంగా ఆహ్వానిస్తాం. మళ్లీ ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తాం. అలాంటి ఎదురుచూపులకు తావివ్వకుండా ఒక అతిథి ఒక అమెరికన్ ఇంట్లోకి ప్రవేశించింది. తలుపు గడియ కొట్టి సింహద్వారం గుండా రాకుండా నేరుగా ఇంటి పైకప్పుకు కన్నం వేసి ఇంట్లోకి దూరింది. మెరుపువేగంతో దూసుకొచ్చిన ఆ అతిథిని చూసి ఆ ఇంటాయన అవాక్కయ్యారు. ఎందుకంటే అది చిన్న రాయి. అది కూడా నిన్న మొన్న నేల తవ్వి తీసిన రాయి కాదు. గట్టిగా మాట్లాడితే అది అసలు భూమి మీది రాయే కాదు.
ఆ రాయి ఉద్భవించినప్పుడు మన పుడమి కూడా పుట్టలేదు. మరి ఆ రాయి ఎక్కడిది? అంటే అంతరిక్షంలో అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలోని గ్రహశకలాల కూటమి నుంచి భూమి వైపు ఇలా దూసుకొచ్చింది. భూమి ఏర్పడకముందు ఆస్ట్రరాయిడ్ బెల్ట్‌లోనే చక్కర్లు కొట్టిన ఈ రాయి జూన్ 26వ తేదీన భూవాతావరణంలోకి చొరబడి చివరకు అమెరికాలో నేలను తాకింది. ఈ బుల్లి గ్రహశకలానికి ‘ది మెక్‌డోనా’ అని పేరు పెట్టారు. జార్జియా రాష్ట్రంలోని ఒక ఇంటి పైకప్పుకు రంధ్రం చేసి మరీ లోపల పడిన ఈ రాయిని జార్జియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంతరిక్ష వస్తువుగా గుర్తించారు.
అట్లాంటా ఆకాశంలో తోకచుక్కలా..
భూమి మీద పడటానికి కొద్దిసేపటి ముందు పట్టపగలే ఇది తోకచుక్కలా అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ దూసుకొచ్చింది. చిన్నపాటి అగ్నిగోళంగా మండుతున్న దీనిని అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల ప్రజలు వీక్షించి తమ కెమెరాల్లో బంధించారు. ఎట్టకేలకు ఇది హెన్రీ కౌంటీనిలోని మెక్‌డోనా ప్రాంతంలోని ఇంట్లో ఇది పడింది. ఇది పడినప్పుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్‌తో షూట్‌చేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అచ్చం అలాంటి శబ్దం వచ్చిందని ఇంటి యజమాని చెప్పారు. విషయం తెల్సుకున్న జార్జియా వర్సిటీలోని భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్కాట్ హారిస్ వెంటనే రంగంలోకి దిగి ఆ ఇంట్లోని చెల్లాచెదురుగా పడిన 50 గ్రాముల ఖగోళదూళిని సేకరించారు.
అందులో 23 గ్రాముల నాణ్యమైన ధూళిని అత్యంత శక్తివంతమైన ఆప్టికల్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లతో పరిశీలించారు. అది ఏకంగా 456 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన లో మెటల్(ఎల్) ఆర్డినరీ ఖోన్‌డ్రైట్ మూలకంతో ఏర్పడిందని తేల్చారు. ఈ లెక్కన ఈ రాయి భూమి కంటే ముందే ఏర్పడింది. ఇన్నాళ్లూ ఇది తన భారీ గ్రహశకలాలలో భాగంగా ఉండేది. అయితే దాదాపు 47 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహశకలం మరింత చిన్నపాటి ముక్కలుగా ఛిద్రమైంది. అలా ఏర్పడిన చిన్నపాటి రాళ్లలో అమెరికాలో పడిన రాయి కూడా ఒకటి అని జార్జియా వర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు.
‘‘ ఈ బుల్లి రాయి 0.50 క్యాలిబర్ బుల్లెట్ కంటే రెట్టింపు పెద్దదిగా ఉంది. కాంతి వేగంతో ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించింది. భూ వాతావరణంలోకి వచ్చాక అధిక గాఢత ఉన్న గాలి దీని వేగాన్ని ఒక్కసారిగా తగ్గించింది. దీంతో ఘర్షణ ఏర్పడి మండింది. వేగం సెకన్‌కు కిలోమీటర్‌కు తగ్గి చివరకు పైకప్పును చీల్చుకుంటూ నేలపై పడింది. దీనికి అధికారికంగా పేరు పెట్టేందుకు గ్రహశకలాల సంఘం కమిటీకి పంపించారు. పేరు పెట్టాక గ్రహశకలాల సంబంధ బులె టిన్‌లో ముద్రి స్తారు. పురాతన ఖగోళ ఖజా నాగా దీనిని అభి వర్ణిస్తున్నారు. దీని నిర్మాణం ద్వారా ఆనాటి అంతరిక్ష వాతావరణ పరిస్థితులను అంచనావే సేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్ని స్తున్నారు. విశ్వం ఇప్పటికీ తన రహస్యాలను ఒక్కొక్క టిగా మనకు తెలియ జేప్పేందుకు ఇలా ఖగోళ దూతలను భూమి మీదకు పంపిస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్