కాలుష్య కణాలగుట్టువిప్పిన గణితవేత్త  | Mathematician Stuart Hawkins Cracks The Code Of Climate Change To Enhance Forecast, Check Out Full Story | Sakshi
Sakshi News home page

కాలుష్య కణాలగుట్టువిప్పిన గణితవేత్త 

Jun 9 2025 6:24 AM | Updated on Jun 9 2025 9:22 AM

Mathematician cracks the code of climate change to enhance forecast

వాతావరణ అంచనా సిద్ధాంతాల్లో లోపాలను సరిచేసిన మేథమెటీషియన్‌ 

భిన్న ఆకృతుల్లోని కాలుష్య అణువులనూ లెక్కగట్టే సూత్రాల అభివృద్ధి 

పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడుతూ భూతాపోన్నతికి కారణమవుతున్న పొగ, కాలుష్యకారక కణాల గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. వీటి కారణంగా ఏ స్థాయిలో కాలుష్యం సంభవిస్తోందో, వాతావరణ మార్పులో వీటి ప్రభావ స్థాయిలను పర్యావరణ వేత్తలు ఇప్పటికే అంచనావేయగల్గుతున్నారు. అయినాసరే ఆకస్మిక వర్షాలు, వరదలు వంటి వాటిని ఇప్పటికీ సరిగా అంచనావేయలేని పరిస్థితి. 

వీటికి కారణంగా గోళాకృతిలో లేని ఇతర రకాల కణాలు కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారుగానీ వీటి పరిమాణాన్ని, ప్రభావాన్ని గణించే విధానాన్ని అభివృద్దిచేయలేకపోయారు. గత 15 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని మాక్వరైటన్‌ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్రవేత్త, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్టార్ట్‌ హాకిన్స్‌ పరిష్కారం కనుగొన్నారు. దీంతో మరింత ఖచి్చతత్వంతో వాతావరణ అంచనా సుసాధ్యంకానుంది. 

2008లో వాతావరణ భౌతికశాస్త్రవేత్త మైఖేల్‌ బాక్స్‌ చేసిన ఒక ప్రసంగాన్ని హాకిన్స్‌ విన్నారు. వాతావరణమార్పులకు కారణమవుతున్న అన్ని ఆకృతుల కాలుష్యకణాలను లెక్కించకుండా మనం చేసే వాతావరణ అంచనాలు భవిష్యత్తులో అంత నిరుపయోగంగా మారే ప్రమాదంఉంది’’అని మైఖేల్‌ బాక్స్‌ చేసిన ప్రసంగం హాకిన్స్‌ను ఆలోచనల్లో పడేసింది. ఈ గజిబిజి ఆకృతుల కణాలను లెక్కగట్టే విధానాన్ని అభివృద్ధిచేసి ఈ పొల్యూషన్‌ పొడుపు ప్రశ్నకు సమాధానం వెతకాలని నిశ్చయించుకుని ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఆ పనిలో సఫలీకృతులయ్యారు. 

ఏమిటీ కణాలు? 
వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే ధూళి కణాలు గోళాకృతిలో ఉంటాయి. కానీ రాజస్థాన్‌లోని థార్‌ఎడారిసహా పలు గనుల తవ్వవం వంటి చోట్ల శిలలు క్రమంగా ఒరుసుకుపోయి, కోతకు గురై అత్యంత సూక్ష్మ శిలా కణాలు ఉద్భవించి గాల్లో కలుస్తున్నాయి. జీవఇంథనాలు మండించినపుపడు వెలువడే కొన్ని రకాల నుసి సైతం భిన్నాకృతిలో ఉంటోంది. ఢిల్లీలో చలికాలంలో నిర్మాణ పనుల వేళ గాల్లో కలిసే పరిశ్రమల వ్యర్థ్యాల నుంచి సైతం వేర్వేరు ఆకృతుల్లో ధూళి కణాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రస్తుతమున్న వాతావరణ సిద్ధాంతాలతో గణించడం కష్టం. 

ఈ కణాలు గాల్లో అధికమై సూర్యరశ్మి భూమిపై పడకుండా అడ్డుకుని భూమిని చల్లబరచవచ్చు లేదంటే భూమి నుంచి వేడి బయటకు పోకుండా అడ్డుకుని భూతాపోన్నతికి కారణం కావచ్చు. ఈ రెండు దృగి్వషియాలను సైతం గోళాకృతియేతర కణాల కోణంలో లెక్కించాల్సి ఉంది. ప్రసరణ దిశలో ఏదైనా వస్తువు అడ్డుగా ఉంటే కాంతి దిశను మార్చుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని ఈ అసాధారణ ఆకృతి కణాలకు అన్వయిస్తూ కంప్యూటేషన్‌ మెథడ్‌ను హాకిన్స్‌ రూపొందించారు. ఇప్పుడీ గణిత సూత్రాలు భవిష్యత్తులో వైద్య ఇమేజింగ్‌ సాంకేతికతల ఆధునీకరణకూ ఉపయోగపడనున్నాయి. 

అ్రల్టాసౌండ్‌ , ఎంఆర్‌ఐ వంటి సాంకేతికతలు తరంగాలు మన శరీరంలో ఎలా ప్రయాణిస్తాయనే సూత్రాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. కొత్త గణిత సూత్రాలతో అత్యాధునిక అ్రల్టాసౌండ్‌ , ఎంఆర్‌ఐ తీయొచ్చు. పలు రకాల కోటింగ్‌లలోనూ విరివిగా వాడొచ్చు. ఈ సూత్రాలను కాంతి విక్షేపణకు సంబంధించిన ప్రతి రంగంలోనూ ఉపయోగించవచ్చు. వడగాల్పులు, రుతుపవన అంచనాలు, కాలుష్య ప్రభావాలు వంటిలోనూ ఈ సూత్రాలను వాడొచ్చు. దీంతో వాతావరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయొచ్చు. ఈ పరిశోధనా వివరాలు ‘క్వాంటేటివ్‌ స్పెక్ట్రోస్కోపీ, రేడియేటివ్‌ ట్రాన్స్‌ఫర్‌’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 
   
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement