మృత్యు గుహలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు | Maldives Six Diver Tragedy: Chilling New Photos Out Details | Sakshi
Sakshi News home page

మృత్యు గుహలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

May 23 2026 10:38 AM | Updated on May 23 2026 10:45 AM

Maldives Six Diver Tragedy: Chilling New Photos Out Details

సముద్రపు అడుగున ఉన్న ఓ చీకటి గుహ.. ఒక్కసారి లోపలికి వెళ్తే దారి తప్పించే ప్రమాదకర సొరంగాలు.. చుట్టూ మట్టి, సిల్ట్‌తో నిండిన మార్గాలు.. బయటకు రావడానికి క్షణక్షణం ప్రాణపోరాటం. వెరసి.. ఘోర డైవింగ్‌ ప్రమాదానికి సంబంధించిన తాజా ఫొటోలు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి.

మాల్దీవుల్లో “షార్క్‌ కేవ్‌”గా పిలిచే ఆ అండర్‌వాటర్‌ గుహలో చిక్కుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.  సముద్రపు అడుగున ఉన్న ప్రమాదకర గుహలో చిక్కుకుని ఐదుగురు ఇటాలియన్‌ డైవర్లు, వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ మాల్దీవుల సైనిక డైవర్‌ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది. డైవింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా మారిందది. అయితే.. తాజాగా బయటకు వచ్చిన గుహ ఫొటోలు చూస్తే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతోంది.

మే 14న మాల్దీవుల వావూ అటోల్‌ సమీపంలోని అలిమథా దీవి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటలీకి చెందిన ఐదుగురు అనుభవజ్ఞులైన డైవర్లు “షార్క్‌ కేవ్‌”గా పిలిచే సముద్ర గుహలోకి అన్వేషణ కోసం వెళ్లారు. ఈ బృందంలో సముద్ర జీవశాస్త్ర నిపుణురాలు మోనికా మోంటోఫాల్కోనే, ఆమె కుమార్తె జార్జియా సొమ్మక్యాల్‌, సముద్ర జీవశాస్త్రవేత్త ఫెడెరికో గువాల్టిరి, పరిశోధకురాలు మ్యూరియల్‌ ఒడ్డెనినో, డైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ గియాన్‌లుకా బెనెడెట్టీ ఉన్నారు. వాళ్లు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. అధికారుల్లో ఆందోళన నెలకొంది. 

కొన్ని గంటల తర్వాత గియాన్‌లుకా బెనెడెట్టీ మృతదేహం గుహ ప్రవేశం దగ్గర లభించింది. మిగిలిన నలుగురి కోసం సహాయక చర్యలు ప్రారంభించగా.. తీవ్ర లోతు, సముద్రపు బలమైన ప్రవాహాలు, చీకటి పరిస్థితులు పెద్ద సవాల్‌గా మారాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్లో పాల్గొన్న మాల్దీవుల సైనిక డైవర్‌ ముహమ్మద్‌ మహుద్దీ కూడా డీకంప్రెషన్‌ సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించినట్లైంది.

చేసేదిలేక.. ఫిన్లాండ్‌కు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం ఆధునిక పరికరాలతో గుహలోకి వెళ్లి మిగిలిన మృతదేహాలను వెలికితీసింది. అధికారుల చెబుతోంది ఏంటంటే..  వీరు సాధారణంగా అనుమతించే లోతుకంటే చాలా ఎక్కువగా సముద్రంలోకి దిగి ఉంటారేమోనని. దాదాపు 50 నుంచి 60 మీటర్ల లోతులో ఉన్న గుహల్లోకి వెళ్లిన తర్వాత దారి తప్పినట్లు భావిస్తున్నారు. గుహలోని సన్నని మార్గాలు, మట్టి లాంటి సిల్ట్‌ నీటిలో కలవడంతో పూర్తిగా కనిపించకుండా పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. 

ఈ ఘటనపై మాల్దీవుల అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన సమయంలో రికార్డ్‌ అయిన గోప్రో వీడియోలు, డైవింగ్‌ పరికరాల డేటాను పరిశీలిస్తున్నారు. భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.

ఆ పేరెలా వచ్చిందంటే..
వావూ అటోల్‌లోని అలిమథా దీవి సమీపంలో ఉన్న “షార్క్ గుహ” మాల్దీవులలో అత్యంత ప్రమాదకరమైన సముద్ర గుహలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ పేరు ఈ గుహలో తరచుగా కనిపించే షార్క్‌ల వల్ల వచ్చింది. ఇక్కడి గుహల్లో రీఫ్ షార్క్‌లు, ఇతర చిన్న షార్క్ జాతులు తరచుగా కనిపిస్తాయి. అందువల్ల స్థానికులు దీనిని “షార్క్ గుహ” అని పిలుస్తారు. స్థానికంగా దీనిని దేవన కందు అని పిలుస్తారు. మాలే రాజధాని నుండి దాదాపు 100 కి.మీ దూరంలో ఉన్న ఈ గుహ, తన లోతు, నిర్మాణం, ప్రవాహాల వల్ల డైవర్లకు ఒక సవాలుగా మారింది.

ఈ గుహలో మూడు విభాగాలు ఉన్నాయి. మొదటి రెండు భాగాలు తక్కువ లోతులో ఉండగా, మూడవ భాగం 50–60 మీటర్ల లోతులో ఉంది. ఈ భాగంలోనే ఇప్పుడు ఇటాలియన్ డైవర్లు చిక్కుకుని ప్రాణాలు పొగొట్టుకున్నారు. గుహలోని మార్గాలు చాలా ఇరుకుగా ఉండి.. మట్టి నీటిలో కలిసిపోవడం వల్ల దారి కనిపించని పరిస్థితులు తాజా ఫొటోలతో బయటకు వచ్చాయి. అలాగే బలమైన సముద్ర ప్రవాహాలు తోడవ్వడంతో డైవర్లకు ఇవి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. 

అలా ఏర్పడ్డాయి.. 
ఈ గుహల నిర్మాణం లక్షల ఏళ్ల భూగర్భ ప్రక్రియల ఫలితం. 55 మిలియన్ ఏళ్ల క్రితం సముద్రపు అడుగున ఉన్న అగ్నిపర్వతాలపై పగడపు దిబ్బలు పెరిగి.. తర్వాత సున్నపు రాళ్ల పొరలు ఏర్పడ్డాయి. గ్లేషియల్ కాలాల్లో సముద్ర మట్టం తగ్గి, సున్నపు రాళ్లు బయటకు వచ్చి వర్షపు నీటితో కరిగి గుహలు ఏర్పడ్డాయి. ఇంటర్‌గ్లేషియల్ కాలాల్లో మంచు కరిగి సముద్ర మట్టం పెరగడంతో ఆ గుహలు మళ్లీ నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రక్రియ 2.6 మిలియన్ ఏళ్లుగా పునరావృతమవుతూ క్రమంగా గుహలు ఏర్పడ్డాయి.

“షార్క్ గుహ” ఇప్పటివరకు పూర్తిగా మ్యాప్ చేయబడలేదు. అందుకే అనుభవజ్ఞులైన డైవర్లకు కూడా అత్యంత ప్రమాదకర ప్రదేశంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ గుహలోకి 30 మీటర్ల లోతు వరకు మాత్రమే డైవింగ్ అనుమతిస్తారు. ఇప్పుడు ఆరుగురి ప్రాణాలు తీసిన గుహ లోపలి భాగంలో ఎలా ఉందో తీసిన పాత వీడియో కింద చూసేయండి..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement