ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మెలోని స్ట్రాంగ్ రిప్లై | I Am Not Anti US Not Kneeling Says Italys Meloni Amid Spat With Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మెలోని స్ట్రాంగ్ రిప్లై

Jun 30 2026 7:24 AM | Updated on Jun 30 2026 7:29 AM

I Am Not Anti US Not Kneeling Says Italys Meloni Amid Spat With Trump

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. తాను అమెరికాకు వ్యతిరేకిని కాదని.. అలాగని ఎవరి ముందూ మోకరిల్లే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఆమెను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో మెలోని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటాలియన్ మీడియాలో ఓ కార్యక్రమంలో మెలోని ఇటలీ-అమెరికా సంబంధాలపై మాట్లాడారు. పాశ్చాత్య దేశాలన్నీ ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటాయని నమ్మే వ్యక్తినని.. పాశ్చాత్య కూటమిలో ఇటలీ మరింత బలంగా ఉంటుందని నమ్ముతానన్న మెలోని... దాని కోసమే నిరంతరం శ్రమిస్తాను. అయితే, బలమైన సంబంధాలు నిజాయితీగా మాట్లాడుకోవడంపైనే ఆధారపడి ఉంటాయని.. తాను చాలా స్పష్టంగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తినంటూ మెలోని పేర్కొన్నారు.

మెలోనిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. జూన్ 21, 22 తేదీల్లో మయామిలో జరగాల్సిన బిజినెస్ ఫోరమ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. తజాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "ప్రధాని జార్జియా మెలోనిపై ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన తీవ్రమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఇటలీ మొత్తాన్ని కించపరిచేలా ఉన్నాయి. అందుకే నా అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నానంటూ ప్రకటించారు.

ఇటలీకి చెందిన 'లా7' ఛానల్‌ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం. ఎవియాన్ సదస్సు సందర్భంగా మెలోనితో జరిగిన సంభాషణపై ఆ ఛానల్‌ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ విచిత్ర సమాధానం ఇచ్చారు. ‘‘మీ ప్రధాని ఎలా ఉన్నారు? ఆమె నాతో ఒక ఫోటో దిగడానికి ఎంతగానో ప్రాధేయపడ్డారు. ఆమెకు నాతో ఫోటో కావాలని చాలా ఆశపడ్డారు. నిజానికి నేను ఫోటో దిగకపోవచ్చు. కానీ ఆమెను చూసి జాలిపడి ఒప్పుకున్నాను’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేను ఆమెతో మాట్లాడినందుకు బహుశా ఆమె సంతోషంగా ఉండవచ్చు. కానీ ఆమెతో మాట్లాడాల్సిన అవసరమైతే నాకు లేదు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement