Sakshi News home page

భారత్‌తో పెట్టుకుంటే అట్లుంటది మరి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు!

Published Fri, Apr 12 2024 7:47 AM

Maldives To Hold Roadshows In Indian Main Cities To Boost Travel - Sakshi

మాలే: భారత్‌తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మాల్దీవులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భారత్‌తో మాల్దీవుల ప్రభుత్వం కయ్యానికి దిగడంతో అసలుకే ఎసరు వచ్చింది. దీంతో, పర్యాటకం రూపంలో మాల్దీవులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగింది మాల్దీవులు. ఇంతకీ ఏమైందంటే.. 

చైనా అనుకూల విధానాన్ని అవలంబిస్తూ మాల్దీవుల ప్రభుత్వం.. భారత్‌తో కయ్యానికి దిగింది. ఈ క్రమంలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతినండంతో మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నది. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారత్‌ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే భారత్‌లోని ముఖ్యమైన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని మాల్దీవ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రావెల్‌ ఏజెంట్స్‌ అండ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ భావిస్తున్నది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నది.

కాగా, మాల్దీవులకు భారత్‌ ఇప్పటికీ కీలకమైన మార్కెట్‌. ఈ క్రమంలోనే తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్‌లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇరుదేశాల మధ్య పర్యటక సంబంధాలను పెంపొందించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని ట్రావెట్స్‌ సంస్థ తెలిపింది.

ఇక, మాల్దీవుల పర్యాటకుల విషయంలో మొదటి స్థానంలో ఉండే భారత్‌.. ప్రస్తుతం ఆరోస్థానానికి చేరింది. అధికారుల వివరాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఏప్రిల్ 10 నాటికి మాల్దీవులకు మొత్తం 6,63,269 మంది టూరిస్టులు వచ్చారు. 71,995 మందితో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్‌ (66,999), రష్యా (66,803), ఇటలీ (61,379), జర్మనీ (52,256), భారత్‌ (37,417)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీంతో, మాల్దీవుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. 

Advertisement
Advertisement