
టోక్యో: ప్రపంచంలోని ఏ విమానాశ్రయానికీ దక్కని ఘనతను జపాన్‌లోని ఆ విమానాశ్రయం సొంతం చేసుకుంది. అదే కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (కిక్స్). గడచిన 30 ఏళ్లలో ఈ విమానాశ్రయంలో ఒక్క లగేజీ కూడా మిస్ కాలేదంటే ఒక పట్టాన నమ్మలేం.. కానీ ఇది ముమ్మాటీకీ నిజం. 2024లో ఈ విమానాశ్రయం ప్రపంచంలోని ఉత్తమ లగేజీ డెలివరీ విమానాశ్రయంగా గుర్తింపు పొందుతూ మరోమారు ‘స్కైట్రాక్స్’ అవార్డును దక్కించుకుంది.
ఒసాకాలోని ఈ కన్సాయ్ విమానాశ్రయం 1994లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటివరకు ఇది ఏటా మూడు కోట్ల ప్రయాణికులకు సేవలు అందిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ విమానాశ్రయం ఎనిమిది సార్లు ‘స్కైట్రాక్స్’ అవార్డును గెలుచుకుంది. లగేజీ పికప్‌కు ముందు వేచి ఉండే సమయం, లగేజీ డెలివరీ సామర్థ్యం, పోగొట్టుకున్న లగేజీల ఆధారంగా వివిధ గణాంకాలు సేకరించి, ఈ అవార్డును అందజేస్తారు. ఈ విమానాశ్రయం 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు కోటి లగేజీలను అందజేసింది.
కిక్ విమానాశ్రయం ట్రాక్ రికార్డ్ ఇంత విజయవంతం కావడానికి కారణం ఇక్కడి ‘మల్టీలేయర్డ్ చెకింగ్ వర్క్’. ప్రతి బ్యాగేజీని పరిరక్షించేందుకు విమానాశ్రయ విభాగం ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించింది. తప్పులను, పొరపాట్లను నివారించేందుకు బహుళ సిబ్బంది సమాచారాన్ని పంచుకోవడం చాలా ముఖ్యమని లగేజీ కార్యకలాపాలను పర్యవేక్షించే సుయోషి హబుటా నిక్కీ తెలిపారు. విమానం వచ్చిన 15 నిమిషాలలోపు ప్రయాణికుల లగేజీలను వారికి అందించడం వారి లక్ష్యంగా ఈ విమాశ్రయ సిబ్బంది పనిచేస్తుంటారు. జపాన్ ప్రజలు అనుసరించే ఆతిథ్య కళ ‘ఓమోటేనాషి’ని ఇక్కడి సిబ్బంది ఆకళింపు చేసుకున్నారు.
ప్రయాణికుల లగేజీని వారికి అందించడమనేది ఒక హామీ అని వారు నమ్ముతారు. ఇక్కడి ప్రతి సూట్‌కేస్‌ను ఇటు డిజిటల్ పద్దతిలో, అటు భౌతికంగానూ డ్యూయల్ ట్యాగింగ్ సిస్టమ్‌తో ట్రాక్ చేస్తారు. ఫలితంగా ఏ బ్యాగు కూడా మిస్సయ్యే అవకాశం ఉండదు. ఇక్కడి సిబ్బందికి లాజిస్టిక్స్‌లో మాత్రమే కాకుండా మానవ తప్పిదాలను ఊహించడంలోనూ శిక్షణ అందిస్తారు. బ్యాగేజీ విషయంలో అవకతవకలు జరిగితే, బ్యాగ్ విమానం నుండి బయటకు వెళ్లే ముందే హెచ్చరిక వ్యవస్థ అప్రమవుతుంది. పర్యాటకులు ఈ విమానాశ్రయాన్ని ‘ప్రయాణికులతో పాటు వారి లగేజీని కూడా గౌరవించే విమానాశ్రయం’ అని ప్రశంసిస్తుంటారు.