జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి? | Japan Prepare Upgrade Defense Strength For Critical To Prevent War, Know More Details Inside | Sakshi
Sakshi News home page

జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి?

Jun 18 2026 7:55 AM | Updated on Jun 18 2026 8:47 AM

Japan Prepare Upgrade defense Strength For critical to prevent war

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతివాద విధానాలను అనుసరించిన జపాన్ ఇప్పుడు రక్షణ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, చైనా సైనిక దూకుడు, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల నేపథ్యంలో రక్షణ సామర్థ్యాల పెంపు అత్యవసరమని జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించాలంటే ముందుగా దానిని అడ్డుకునే శక్తి ఉండాలని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జపాన్ చేపడుతున్న చర్యలు ఆసియా భద్రతా సమీకరణాల్లో కీలక మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధాన్ని పూర్తిగా తిరస్కరించిన దేశం ఇప్పుడు ఎందుకు సైనిక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం వచ్చిందనే ప్రశ్నకు ఈ వ్యాఖ్యలే సమాధానంగా కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు యుద్ధాన్ని పూర్తిగా త్యజించి శాంతివాద దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన జపాన్.. ఇప్పుడు రక్షణ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చైనా సైనిక విస్తరణ, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతకు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన.. యుద్ధాన్ని నివారించాలంటే ముందుగా దానిని అడ్డుకునే శక్తి ఉండాలి. శాంతిని కాపాడుకోవాలంటే ప్రత్యర్థి దాడి చేయాలనే ఆలోచనకే భయపడేంత శక్తి మన దగ్గర ఉండాలి. అందుకే జపాన్ తన రక్షణ రంగంలో భారీ మార్పులు తీసుకువస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీంతో, ఆ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

జపాన్‌లో ఈ మార్పుకు కారణం?
ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారింది. ముఖ్యంగా చైనా సైనిక శక్తి పెరుగుదల జపాన్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత పదేళ్లలో చైనా తన నౌకాదళం, వైమానిక దళం, క్షిపణి వ్యవస్థలను విస్తృతంగా అభివృద్ధి చేసింది. తైవాన్ చుట్టూ తరచూ నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు, తూర్పు చైనా సముద్రంలో జపాన్ నియంత్రణలో ఉన్న సేన్‌కాకు దీవుల సమీపంలో చైనా నౌకల సంచారం, దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దూకుడు టోక్యోలో భద్రతా ఆందోళనలను పెంచుతున్నాయి.

జపాన్‌కు కేవలం చైనా మాత్రమే కాదు. ఉత్తర కొరియా కూడా మరో పెద్ద సవాల్‌గా మారింది. తరచూ నిర్వహిస్తున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు, అణ్వాయుధ కార్యక్రమాలు జపాన్ భద్రతకు నేరుగా ముప్పుగా భావిస్తున్నారు. ఉత్తర కొరియా ప్రయోగించిన కొన్ని క్షిపణులు జపాన్ గగనతలంపై నుంచి దూసుకెళ్లడం అక్కడ ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దాడి కూడా జపాన్ విధానంలో పెద్ద మార్పునకు కారణమైంది. శాంతి కోసం ఒప్పందాలు సరిపోవు.. అవసరమైతే శక్తి కూడా ఉండాలి అనే భావన జపాన్ విధాన నిర్ణేతల్లో బలపడింది.

శాంతివాద దేశం నుంచి సైనిక శక్తి వైపు..
1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ రాజ్యాంగంలోని 9వ అధికరణం ప్రకారం యుద్ధాన్ని శాశ్వతంగా త్యజించింది. దాడి చేసే సైన్యాన్ని కాకుండా కేవలం రక్షణ కోసం మాత్రమే ‘సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’ను ఏర్పాటు చేసింది. ఇలా దశాబ్దాల పాటు జపాన్ ప్రపంచానికి శాంతివాద దేశంగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచ భద్రతా సమీకరణాల్లో వచ్చిన మార్పులు జపాన్‌ను తన వ్యూహాన్ని పునఃపరిశీలించేలా చేశాయి.

ఇటీవల జపాన్ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే నిర్ణయం తీసుకుంది. గతంలో జీడీపీలో కేవలం 1 శాతం మాత్రమే రక్షణకు కేటాయించగా, ఇప్పుడు దాన్ని 2 శాతానికి పెంచుతోంది. ఇది జపాన్ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ విస్తరణగా భావిస్తున్నారు.

జపాన్ ఏం చేస్తోంది ?

  • జపాన్ ప్రస్తుతం పలు కీలక రక్షణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.

  • అమెరికా నుంచి అత్యాధునిక టోమాహాక్ క్షిపణుల కొనుగోలు

  • దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం కలిగిన క్షిపణుల అభివృద్ధి

  • సైబర్ యుద్ధ సామర్థ్యాల పెంపు

  • కృత్రిమ మేధ (AI) ఆధారిత రక్షణ వ్యవస్థలు

  • డ్రోన్ టెక్నాలజీ విస్తరణ

  • అంతరిక్ష భద్రతా వ్యవస్థల బలోపేతం

  • బ్రిటన్, ఇటలీలతో కలిసి ఆరో తరం యుద్ధ విమానాల అభివృద్ధి

  • ఇవన్నీ కేవలం రక్షణ కోసమేనని జపాన్ చెబుతున్నప్పటికీ, ఆసియా భద్రతా సమీకరణాల్లో ఇవి కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.

చైనా స్పందన ఏంటి?
జపాన్ చర్యలను చైనా తీవ్రంగా విమర్శిస్తోంది. జపాన్ మళ్లీ సైనికవాదం వైపు వెళ్తోందని బీజింగ్ ఆరోపిస్తోంది. అయితే, కోయిజుమి ఈ విమర్శలను ఖండించారు. అణ్వాయుధాలు లేని, ఇతర దేశాలపై దాడి చేసే విధానం లేని జపాన్‌ను సైనికవాద దేశంగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. నిజానికి ప్రాంతీయ అస్థిరతకు కారణం చైనా సైనిక విస్తరణేనని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.

అమెరికా పాత్ర ఎంత కీలకం?
జపాన్ భద్రతలో అమెరికా ప్రధాన భాగస్వామి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన భద్రతా ఒప్పందం ప్రకారం జపాన్‌పై దాడి జరిగితే అమెరికా రక్షణకు రావాల్సి ఉంటుంది. జపాన్‌లో దాదాపు 50 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాను సమతుల్యం చేయడంలో అమెరికా-జపాన్ భాగస్వామ్యం కీలకంగా మారింది. అందుకే జపాన్ రక్షణ సామర్థ్యాల పెంపు కేవలం టోక్యో నిర్ణయం మాత్రమే కాదు.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కూడా అనుగుణంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జపాన్ పంపుతున్న సందేశం..
జపాన్ తాజా వ్యూహం వెనుక ఒకే సందేశం ఉంది. శాంతి కోసం బలం అవసరం అని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశం ఇప్పుడు యుద్ధాన్ని నివారించేందుకు సైనిక శక్తిని పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జపాన్ చెబుతోంది. చైనా, ఉత్తర కొరియా, రష్యా వంటి భద్రతా సవాళ్ల మధ్య జపాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆసియా భవిష్యత్తు భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది. అయితే, జపాన్ ప్రస్తుతం చేపడుతున్న రక్షణ విస్తరణ కేవలం ఆయుధాల కొనుగోలు కాదు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతివాద విధానానికి అతిపెద్ద మలుపు. రాబోయే దశాబ్దంలో జపాన్ ఆసియాలో మరింత ప్రభావవంతమైన సైనిక, వ్యూహాత్మక శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement