
వైమానిక దాడులు, కాల్పులు ఆపని ఇజ్రాయెల్ ఆర్మీ
డెయిర్ అల్–బలాహ్: గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడులు, కాల్పుల ఘటనల్లో కనీసం 70 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర, సెంట్రల్ గాజా పై శనివారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగాయని అల్ జెజీరా తెలిపింది. మృతుల్లో కనీసం 36 మంది గాజా నగరంలోని వారేనని పేర్కొంది. నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని ఓ నివాసంపై జరిగిన దాడిలో కుటుంబంలోని 9 మంది చనిపోయారని అల్ ఔదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
గాజా నగరంలోని టుఫాలో జరిగిన మరో దాడిలో 11 మంది మృతి చెందారు. వీరిలో సగం మంది మహిళలు, చిన్నారులేనని అల్ అహ్లీ ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. షటి శరణార్థి శిబిరంపై జరిగిన మరో దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు షిఫా ఆస్పత్రి పేర్కొంది. గాజాలోని వేర్వేరు చోట్ల ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు.
గాజా నగరాన్ని పూర్తిగా ఆక్రమించుకునేందుకు భారీగా సైన్యాన్ని రంగంలోకి దించిన ఇజ్రాయెల్.. వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ ప్రజలకు హెచ్చరికలు కొనసాగిస్తోంది. దీంతో, ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా నగరాన్ని విడిచి వెళ్లిపోగా, తాము ఎక్కడికి వెళ్లలేమంటూ మరో 7 లక్షల మంది భవనాల శిథిలాలు, టెంట్లలోనే ఉండిపోయారు. గడిచిన రెండు వారాల్లో ఇజ్రాయెల్ ఆర్మీ జరిపి వైమానిక దాడుల్లో రెండు క్లినిక్‌లు ధ్వంసమయ్యాయని స్థానికులు తెలిపారు.
ఔషధాలు, పరికరాలు, ఆహారం, ఇంధనం లేకపోవడంతో మరో రెండు ఆస్పత్రులను నిర్వాహకులు మూసివేయాల్సి వచ్చిందన్నారు. చాలా మంది పేషెంట్లు, సిబ్బంది ఆస్పత్రులను వదిలి వెళ్లిపోతున్నారు. చాలా తక్కువ సంఖ్యలో వైద్యులు, నర్సులు మాత్రమే కదల్లేని రోగులు, ఇంక్యుబేటర్లలో ఉంచిన చిన్నా రులకు వైద్య సాయం అందిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు తీవ్ర రూపం దాల్చడంతో తమ సేవలను నిలిపివేస్తున్నామని ‘డాక్టర్స్ వితౌవుట్ బోర్డర్స్’గ్రూపు వైద్యులు శుక్రవారం ప్రకటించారు.
గాజాలో హమాస్ లక్ష్యంగా చేపట్టిన తమ ఆపరేషన్ పని పూర్తయ్యాకే ఆగుతుందని ఐరాస జనరల్ అసెంబ్లీలో తోటి ప్రపంచ దేశాల నేతల సమక్షంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. 2023 అక్టోబర్ 7న హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల్లో ఇప్పటి వరకు 65 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 1.67 లక్షల మంది గాయపడ్డారు. బాధితుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులేనని గాజా ఆరోగ్య విభాగం చెబుతోంది.