పలువురు ముష్కరులు మృతి చెందారన్న అమెరికా ఆర్మీ
ఉగ్రవాదులకు ‘హ్యాపీ క్రిస్మస్’అంటూ ట్రంప్ వ్యాఖ్య
ఇవి ఉమ్మడి దాడులన్న నైజీరియా ప్రభుత్వం
వెస్ట్ పామ్ బీచ్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) లక్ష్యంగా అమెరికా వాయవ్య నైజీరియాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది. నైగర్–నైజీరియా సరిహద్దుల్లో ఉన్న సొకొటొ రాష్ట్రంలో ఐఎస్ నడుపుతున్న క్యాంపులపై ఈ దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ప్రాబల్యం కోసం ఐఎస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది.
నైజీరియా యంత్రాంగం వినతి మేరకు గురువారం తమ దాడుల్లో పలువురు మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారముందని అమెరికా మిలటరీ ప్రకటించింది. అమాయక క్రైస్తవులను అమానుషంగా చంపుతున్నందుకే ఐఎస్ శిబిరాలపై భీకర, శక్తివంతమైన దాడులు చేపట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
అయితే, ఇది అమెరికా బలగాలతో కలిసి చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్ అని, నైజీరియా ప్రజలను చంపుతున్న ఉగ్రవాదులే తమ లక్ష్యమని నైజీరియా విదేశాంగ మంత్రి యూసుఫ్ మైతామాని అన్నారు. అదేవిధంగా, దాడులకు మతం ప్రాతిపదిక కాదని, క్రిస్మస్‌తో సంబంధం లేదని యూసుఫ్ స్పష్టం చేశారు. నైజీరియా నిఘా విభాగం అందించిన సమాచారం మేరకు ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడులు జరిగాయన్నారు.
మరిన్ని దాడులకు అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. అయితే, జిహాదీ గ్రూపుల దాడుల నుంచి క్రైస్తవులను కాపాడటంలో నైజీరియా ప్రభుత్వం విఫలమైందంటూ కొంతకాలంగా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. ‘ప్రత్యేకంగా ఆందోళనకరంగా మారిన దేశం’గా నైజీరియాపై అమెరికా ప్రభుత్వం ముద్ర వేసింది. దీని ప్రకారం.. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు చోటుచేసుకున్న ఇలాంటి దేశాలపై ఆంక్షలు విధించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే అమెరికా మిలటరీ నవంబర్ నుంచే నైజీరియాలోని ఐఎస్ గ్రూపు స్థావరాలపై దాడులకు పథకం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఐఎస్ అనుబంధ గ్రూపుల హింస
నైజీరియాలోని వాయవ్య ప్రాంతంలోని రెండు రాష్ట్రాల్లో ఐఎస్ అనుబంధ గ్రూపులు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐఎస్‌కు సంబంధించిన ఓ గ్రూపు ఇప్పటికే బోర్నో రాష్ట్రంలో గట్టి పట్టు సాధించింది. ఈశాన్య నైజీరియాలో బోకోహరామ్, ఐఎస్ అనుబంధ గ్రూపులు గత పదేళ్లుగా వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని ఆక్లెడ్ అనే మానవ హక్కుల విభాగం తెలిపింది. ఈ గ్రూపు ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ పరమైన హింసను విశ్లేíÙస్తుంది.
ఐఎస్ అనుబంధ ‘నైజీరియా–ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్’ఈశాన్య ప్రాంతంలో నడుస్తున్న అతిపెద్ద గ్రూపని విశ్లేషకుడు బులామా బుకాటి చెప్పారు. అదే వాయవ్య సొకొటొ, కెబ్బి రాష్ట్రాల్లో ప్రాబల్యం కోసం స్థానికంగా లకురమా అని పిలిచే గ్రూపు ప్రయతి్నస్తోందన్నారు. ఈ గ్రూపునే తాజాగా అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ గ్రూపు సొకొటొలోని ప్రజలపై సామాజిక ఆంక్షలను అమలు చేస్తోందని చెప్పారు. అదే సమయంలో, సెంట్రల్ నైజీరియా ప్రాంతంలో క్రైస్తవులైన రైతులు, ముస్లింలైన పశువుల కాపరుల మధ్య నీళ్లు, పచి్చక బయళ్ల విషయమై తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని బుకాటి వివరించారు.
ట్రంప్ ఆరోపణల్లో నిజముందా?
నైజీరియాలోని వివిధ జిహాదీ గ్రూపులు జరుపుతున్న దాడుల్లో ముస్లింల కంటే క్రైస్తవులే ఎక్కువ మంది చనిపోయారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని మానవ హక్కుల సంస్థలంటున్నాయి. బాధితుల్లో రెండు మతాల వారూ దాదాపు సమానంగానే ఉంటున్నారన్నాయి. క్రిస్మస్ రోజు రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా..‘నైజీరియాలో రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం పెచ్చుమీరడాన్ని మేం జరగనీయం. హ్యాపీ క్రిస్మస్’అంటూ వ్యాఖ్యానించారు. దాడులకు మద్దతు, సహకారం అందించిన నైజీరియా ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఓ యుద్ధ నౌక నుంచి క్షిపణిని ప్రయోగిస్తున్న ఫొటోను రక్షణ శాఖ విడుదల చేసింది. నైజీరియా జనాభా 22 కోట్లు కాగా, వీరిలో క్రైస్తవులు, ముస్లింలు సమాన సంఖ్యలో ఉన్నారు.


