Israel-Hamas war: గాజాలో కన్నీటి చుక్కలు | Israel And Hamas War: Gaza Hospitals In Crisis As Fuel Supplies Will Run Out Across The Territory In Coming Hours - Sakshi
Sakshi News home page

Israel-Hamas War: గాజాలో కన్నీటి చుక్కలు

Published Thu, Oct 26 2023 5:53 AM | Last Updated on Thu, Oct 26 2023 1:06 PM

Israeli-Palestinian conflict: Gaza hospitals in crisis as fuel runs out - Sakshi

సరిహద్దు నుంచి గాజా స్ట్రిప్‌ వైపునకు బాంబు ప్రయోగిస్తున్న ఇజ్రాయెల్‌ శతఘ్ని దళం

రఫా/టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇంధన కొరత వల్ల సహాయక చర్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్‌ లేకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి. క్షిపణుల దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించే అవకాశం లేకుండాపోయింది. వాటికింద చిక్కుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మరోవైపు ఇంధనం కొరతవల్ల ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదు.

డాక్టర్లు శస్త్రచికిత్సలు ఆపేస్తున్నారు. క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం పదుల సంఖ్యలో మృతదేహాలు ఆసుపత్రుల నుంచి శ్మశానాలకు చేరుతున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యూఎన్‌ ఏజెన్సీ ఫర్‌ పాలస్తీనియన్‌ రెఫ్యూజీస్‌’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాకు ఇంధన సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని బుధవారం ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇంధనం సరఫరా చేయకపోతే గాజాలో సహాయక చర్యలు అతిత్వరలో పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది.  

ససేమిరా అంటున్న ఇజ్రాయెల్‌  
గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 6 లక్షల మంది ఐక్యరాజ్యసమితి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు సరిహద్దు నుంచి ఆహారం, నిత్యావసరాలను గాజాకు చేరవేసేందుకు ఇజ్రాయెల్‌ ఇటీవల అనుమతి ఇచి్చంది. దాంతో కొన్ని వాహనాలు గాజాకు చేరుకున్నాయి. పరిమితంగా అందుబాటులోకి వచి్చన ఆహారం, నిత్యావసర సామగ్రిని రేషనింగ్‌ విధానంలో పాలస్తీనియన్లకు సరఫరా చేస్తున్నారు. ఇంధన కొరత మాత్రం తీరడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్‌ను గాజాలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ సైన్యం తెగేసి చెబుతోంది.    

చేతులేత్తేయడమే మిగిలింది  
‘యూఎన్‌ ఏజెన్సీ ఫర్‌ పాలస్తీనియన్‌ రెఫ్యూజీస్‌’ ప్రస్తుతం గాజాలో సహాయక చర్యల్లో నిమగ్నమైంది. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తోంది. విద్యుత్‌ లేక, పెట్రోల్, డీజిల్‌ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకపై క్షతగాత్రులకు సేవలందించే పరిస్థితి లేదని చెబుతోంది. ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి కూడా వాహనాలకు ఇంధనం లేదని పేర్కొంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పూర్తిగా చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదని ‘యూఎన్‌ ఏజెన్సీ ఫర్‌ పాలస్తీనియన్‌ రెఫ్యూజీస్‌’ అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మూడింట రెండొంతులు ఇప్పటికే మూతపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.   

సిరియాలో 8 మంది జవాన్లు మృతి  
ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య మొదలైన యుద్ధం మధ్యప్రాచ్యంలో అగ్గి రాజేస్తోంది. హమాస్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచేవారిని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు సిరియా ప్రభుత్వం మద్దతు పలుకుతుండడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ సైన్యం బుధవారం దక్షిణ సిరియాలోని సైనిక శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 8 మంది సిరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా నుంచి తమపై రాకెట్‌ దాడులు జరుగుతుండడంతో తిప్పికొట్టామని, వైమానిక దాడులు చేసి సిరియా సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.  

ఒక్కతాటిపైకి మిలిటెంట్‌ సంస్థలు!
ఇజ్రాయెల్‌ సైన్యం దూకుడు పెంచిన నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ముఖ్య నేత హసన్‌ నస్రల్లా బుధవారం హమాస్, పాలస్తీనియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌ అగ్రనాయకులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ సైన్యంపై హమాస్, హెజ్బొల్లా, పాలస్తీనియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థలు కలిసి పోరాడే సూచనలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల దాడులకు దిగితే తగిన మీకు గుణపాఠం నేర్పుతామంటూ ఇజ్రాయెల్‌ను హెజ్బొల్లా హెచ్చరించింది. హమాస్‌కు ఇరాన్‌ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ చెప్పారు. ఇరాన్‌లోని మిలిటెంట్‌ సంస్థలు ఇరాక్, యెమెన్, లెబనాన్‌ భూభాగల నంచి ఇజ్రాయెల్‌ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.  
 
బందీల విడుదలకు ఖతార్‌ యత్నాలు   
హమాస్‌ చెర నుంచి బందీలు విడుదలయ్యే విషయంలో మరిన్ని సానుకూల పరిణామాలు చూడొచ్చని ఖతార్‌ ప్రధానమంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహా్మన్‌ అల్‌–థానీ చెప్పారు. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే నలుగురు బందీలు విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలినవారిని సైతం విడుదల చేసేలా హమాస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఖతార్‌ ప్రధానమంత్రి తెలిపారు. బందీల విడుదలకు చొరవ చూపుతున్న ఖతార్‌ ప్రభుత్వానికి ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా మండలి అధినేత టాగీ హనెగ్బీ కృతజ్ఞతలు తెలియజేశారు.   

మధ్యప్రాచ్యం నుంచి అమెరికన్ల తరలింపు!  
ఇజ్రాయెల్‌–హమాస్‌ ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే, అక్కడున్న తమ పౌరులను స్వదేశానికి తరలించాలని యోచిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్‌ నుంచి అమెరికా పౌరుల తరలింపు ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది అమెరికన్లు ఇజ్రాయెల్‌ వదిలి వెళ్లిపోయారు. మధ్యప్రాచ్య దేశాల్లో పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఉన్నారు. యుద్ధం గనుక విస్తరిస్తే వారి భద్రతకు భరోసా ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పరిస్థితి అదుపు తప్పకముందే వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా సౌరే అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్‌ తాజా పరిస్థితులపై చర్చించారు. ఘర్షణను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.  

రెండు రోజుల్లో 750 మంది మృతి  
గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల తీవ్రత పెంచింది. బుధవారం కొన్ని టార్గెట్లపై క్షిపణులు ప్రయోగించింది. హమాస్‌ స్థావరాలను, సొరంగాలను, ఆయుధాగారాలను, సమాచార వ్యవస్థను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. మంగళవారం, బుధవారం జరిగిన దాడుల్లో గాజాలో 750 మందికిపైగా జనం మృతిచెందారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 5,791 మందికిపైగా మరణించారని, 16,297 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. గాజాలోని మృతుల్లో 2,300 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ దాడుల్లో 96 మంది పాలస్తీనియన్లు బలయ్యారు. 1,650 మంది క్షతగాత్రులుగా మారారు.

10 మంది యూదులను చంపేశా!  
ఇజ్రాయెల్‌లో 10 మంది యూదులను చంపేశానంటూ హమాస్‌ మిలిటెంట్‌ ఒకరు తన తల్లిదండ్రులతో మొబైల్‌ ఫోన్‌లో చెప్పిన ఆడియో రికార్డు ఒకటి వెలుగులోకి వచి్చంది. ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ దీన్ని విడుదల చేసింది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్‌ భూభాగంలోని కిబుట్జ్‌లో తానున్నానని, తాను ఒక్కడినే 10 మంది యూదులను మట్టుబెట్టానని సదరు మిలిటెంట్‌ గాజాలోని ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి గర్వం తొణికిసలాడే స్వరంతో ఆనందంగా చెప్పాడు. దాంతో వారు అతడిని శభాష్‌ అంటూ అభినందించారు. మిలిటెంట్‌ ఉపయోగించిన ఫోన్‌ అతడి చేతిలో చనిపోయిన ఇజ్రాయెల్‌ పౌరుడిదే కావడం గమనార్హం. అయితే, ఈ ఆడియో రికార్డు నిజమైందో కాదో ఇంకా నిర్ధారణ కాలేదని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement