ఇరాన్‌ టార్గెట్‌ ట్రంప్‌.. హత్యకు ప్లాన్‌: నెతన్యాహు | Israel Netanyahu Claims Iran Masterminded On Trump | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ టార్గెట్‌ ట్రంప్‌.. హత్యకు ప్లాన్‌: నెతన్యాహు

Jun 16 2025 7:52 AM | Updated on Jun 16 2025 10:51 AM

Israel Netanyahu Claims Iran Masterminded On Trump

జెరూసలేం: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. పరస్పర దాడుల కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇలాంటి క్రమంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరాన్ చంపాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్‌కు నంబర్‌ వన్‌ శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. ఇరాన్‌తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్‌ రద్దుచేశారు. ఇందులో ట్రంప్‌ నిర్ణయాత్మక నాయకుడు. తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్‌ను ఇరాన్‌ గుర్తించింది. అందుకే ట్రంప్‌ లేకుండా చేయాలని ఇరాన్‌ భావిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్లాన్‌ చేసింది. ఇరాన్‌ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయెల్‌ తననే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయి’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, ఇరాన్‌ వరుసగా మూడో రోజూ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్‌ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్‌ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్‌ దద్దరిల్లిపోయింది. ఇరాన్‌ క్షిపణులు ఇజ్రాయెల్‌లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావొద్దని ఇరాన్‌ను ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవినీ ఎరగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయని పునరుద్ఘాటించారు.

క్షిపణులతో హోరెత్తించిన ఇరాన్‌
ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. యుద్ధవిమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. హైఫా సిటీలో చమురుశుద్ది కర్మాగారంపై దాడులు చేయడంతో పైప్, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు దెబ్బతిన్నాయి. దాడుల్లో ఇప్పటిదాకా 14 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. 390 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. టెల్‌అవీవ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరుసగా మూడోరోజు మూసేశారు. టెల్‌అవీవ్‌ వీధుల్లో కుప్పకూలిన భవనాలు, కాలిపోయిన కార్లు, బద్దలైన కిటికీలు, తలుపులూ దర్శనమిస్తున్నాయని అసోసియేటెట్‌ ప్రెస్‌ రిపోర్టర్‌ తెలిపారు.

టెల్‌ అవీవ్‌కు దక్షిణాన బాట్‌యామ్‌ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా 35 మంది జాడ గల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. ఘటనాస్థలిని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ సందర్శించారు. ఇరాన్‌ కావాలనే జనావాసాలపైనే దాడులు చేస్తోందని మండిపడ్డారు.

మీరు ఆపితే మేమూ ఆపుతాం
దాడుల వేళ ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌ దాడులను ఆపితే తామూ దాడులను నిలిపేస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు. కానీ ఇజ్రాయెల్‌ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషెహర్‌ ప్రావిన్సులో ఖతార్‌తో కలిసి ఇరాన్‌ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్‌ రిఫైనరీపై దాడి చేసింది’’ అంటూ మండిపడ్డారు. తమ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోందని దుయ్య బట్టారు. ఒమన్‌ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఆదివారం జరగాల్సిన ఆరో విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్‌ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్ధరహితమని ఇరాన్‌ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు తామూ సిద్ధమని జర్మనీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement