
అక్కడ మానవ ఆవాసాలు ఏర్పడితే అనుక్షణం విద్యుత్ అత్యావసరం
అందుకే నిరంతర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు
మరో ఐదేళ్లలో నిర్మించాలని యోచన
వ్యోమగాములు తమ అంతరిక్ష పరిశో ధనలకు మజిలీగా చందమామను మార్చుకోవాలని భావిస్తున్న తరుణంలో చంద్రునిపై ఏకంగా అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని నాసా భావిస్తోంది. అయితే 2030కల్లా అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఎక్కువకాలంపాటు వ్యోమగాములు చంద్రునిపైనే స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవించాలన్నా, ఎలాంటి విద్యుత్ అవాంతరాల లేకుండా శాస్త్రసాంకేతిక పరిశోధనలు కొనసా గించాలన్నా అనుక్షణం విద్యుత్ సరఫరా తప్పనిసరి.
ప్రాణాధార ఉపకరణాలకూ విద్యుత్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఐదేళ్ల లోపే అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయా లని నాసా భావిస్తోంది. కేంద్రక విచ్చిత్తి (న్యూక్లియర్ ఫిజన్) సూత్రంపై పనిచేసే అణుప్లాంట్‌ను అక్కడ నెలకొల్పనున్నారు. అయితే నాసాకు పోటీగా సొంత అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చైనా, రష్యాలు సైతం ప్రకటించాయి. మరో పదేళ్లలో ఈ ప్లాంట్‌లను ఏర్పాటుచేస్తామని ఇప్పటికే వెల్లడించాయి.
అణు విద్యుతే ఎందుకు?
చందమామపై స్థిరనివాసం ఏర్పర్చుకునే వ్యోమగాముల నిరంతర విద్యుత్ అవసరా లను సౌరవిద్యుత్ ఏమాత్రం తీర్చలేదు. ఎందుకంటే చంద్రునిపై ప్రతిరోజూ సూర్యకాంతి ప్రసారం కాదు. 14 రోజులపాటు ఏకధాటి గా ఎండకాచి తర్వాత 14 రోజులపాటు మైనస్ డిగ్రీ సెల్సియస్ స్థాయిలో చిమ్మచీకటి నెలకొంటుంది. ఈ చీకటిమయ రోజుల్లో విద్యుత్ అవసరాలు తీర్చే ఏకైక ప్రత్యామ్నా యంగా అణువిద్యుత్‌కేంద్రం నిలుస్తోంది. అందుకే ఎంత ఖర్చయినాసరే వ్యయప్రయా సల కోర్చి చంద్రునిపై న్యూక్లియర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నాసా కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన లకు సైతం పచ్చజెండా ఊపింది. మరో ఐదేళ్లలో అక్కడ అణువిద్యుత్ ప్లాంట్ కలను సాకారంచేయాలని కంకణం కట్టుకుంది.
చిన్నస్థాయిలో మొదలెట్టి
అణువిద్యుత్ కేంద్రంలో ఏవైనా ప్రమాదాలు సంభవించినా అక్కడ శూన్యం ఉంటుందికనుక రేడియోధార్మికత అంతటా వ్యాపిస్తుందన్న భయం అక్కర్లేదు. థర్మల్, జల, పవన విద్యుత్‌లతో పోలిస్తే చందమామపై అణువిద్యుత్ మాత్రమే ఆచరణ సాధ్యమవుతుంది. సౌరఫలకాలతో సూర్యకాంతిని ఒడిసిపట్టి సౌర విద్యుత్‌ను తయారుచేసినా అది అక్కడి వ్యోమగాముల అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని న్యూక్లియర్ ప్లాంట్ వైపు శాస్త్రవేత్తలు మొగ్గుచూపుతున్నారు. తొలుత కేవలం 100 కిలోవాట్ల విద్యుత్‌ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. భూమి మీద అయితే ఇదే 100 కిలోవాట్ల విద్యుత్‌తో 80 గృహాల విద్యుత్‌అవసరాలు తీర్చొచ్చు. దశలవారీగా ప్లాంట్‌ను విస్తరించి గణనీయమైన స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
సమస్యలెన్నో..
.జల, థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లతో పోలిస్తే అణువిద్యుత్ ప్లాంట్‌కు పెద్దగా భూవిస్తీర్ణంతో పనిలేదు. కానీ చంద్రుని మీదకు ఈ మొత్తం అణువిద్యుత్ వ్యవస్థ ఉపకరణాలను మోసుకెళ్లాలంటే చాలా చాలా కష్టం. పైగా ఇవి రాకెట్‌లో తరలించేంత తేలికగా ఉండాలి. అత్యధిక బరువులను ఇప్పుడున్న రాకెట్లు అస్సలుమోయలేవు. ఒకవేళ అధిక బరువులను మోసుకెళ్లేలా వ్యోమనౌకలను డిజైన్‌చేసి రూపొందించినా అవి అంత బరువును మోస్తూకూడా జాగ్రత్తగా చంద్రునిపై ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చి అది క్రాష్ ల్యాండ్ అయినా వేలకోట్ల రూపాయల నష్టం ఖాయం.
భూమిపై అయితే అణువిద్యుత్ కేంద్రాన్ని ఎంతో మంది సాంకేతిక నిపుణులు తీరిగ్గా, నిశితంగా తనిఖీచేసి నిర్మిస్తారు. చంద్రునిపై ఈ ప్లాంట్‌ను నిర్మించాలంటే కార్మిక సిబ్బంది దొరకరు. ఉన్న ఆ కొద్దిపాటి వ్యోమగాములే అణుప్లాంట్ ఉన్నతాధికారుల అవతారమెత్తి ప్లాంట్‌ను బిగించాల్సి ఉంటుంది. అణువిద్యుత్ ప్లాంట్ నుంచి అత్యధిక స్థాయిలో వేడిమి వెలువడుతుంది. దానికి చల్లబరిచే కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలి. వాటిని కూడా భూమి మీద నుంచే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన వ్యవహారం.
శూన్యస్థితిని తట్టుకునేలా వినూత్న రీతిలో ప్లాంట్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. రేడియోధార్మిక వ్యర్థ్యాల పారబోత, ప్లాంట్ పాడైతే రిపేర్లు వంటి ఎన్నో అవరోధాలు అక్కడి హఠాత్తుగా స్వాగతం పలుకుతాయి.వీటిని తట్టుకుంటూనే ప్లాంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ట్రంప్ హయాంలో నాసాకు అంతరిక్ష పరిశోధనా బడ్జెట్‌లో భారీ కోత పెట్టిన నేపథ్యంలో ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చి ఈ ప్రాజెక్ట్‌ను సఫలీకృతం చేయాల్సి ఉంది. ఇన్ని బాలారిష్టాలను దాటుకుని ప్లాంట్ ఏర్పాటు సుసాధ్యమైతే జాబిలిపై మానవనివాసం ఎలాంటి జంజాటాలు లేకుండా హాయిగా సాగుతుంది.