Israel-Hamas War Latest News: గాజాపై భూతల యుద్ధం! 

Israel Hamas Gaza Palestine War - Sakshi

హమాస్‌ మిలిటెంట్లను నిర్మూలించడమే లక్ష్యం  

సన్నాహాలు ప్రారంభించిన ఇజ్రాయెల్‌ సైన్యం 

3.60 లక్షల మంది రిజర్వ్‌ సైనికులు సిద్ధం  

గాజాను ఆక్రమించుకొనే యోచనలో నెతన్యాహూ ప్రభుత్వం  

ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య పోరు ఉధృతం  

యుద్ధంలో 2,600కు చేరిన మృతుల సంఖ్య  

ఇజ్రాయెల్‌లో 1,300 మంది, 

గాజాలో 1,350 మంది మృతి   

జెరూసలేం/వాషింగ్టన్‌: చుట్టూ ఎటు చూసినా శిథిలాలు.. వాటి కింద చిక్కుకున్న మృతదేహాలు, కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, రాత్రయితే కరెంటు లేక చిమ్మచీకటి, మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళన.

గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. ఆహారం కోసం జనం దుకాణాలు, బేకరీల ముందు బారులు తీరుతున్నారు. చాలావరకు అవి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో తిండిగింజలు, నిత్యావసరాలు ఎప్పుడో నిండుకున్నాయి. గాజా ప్రజలకు ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం ఆరో రోజు గురువారం కూడా కొనసాగింది. ఇరుపక్షాల మధ్య పోరు ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగించింది. హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపించారు.

ఇరువర్గాల మధ్య యుద్ధంలో మృతుల సంఖ్య 2,600కు చేరింది. గాజాలో 1,350 మందికిపైగా జనం మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తమ దేశంలో 222 మందిసైనికులు సహా 1,300 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది.  

ఇజ్రాయెల్‌ పదాతి దళాలు సన్నద్ధం  
హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం ఇక భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి, ప్రతి ఇల్లూ గాలిస్తూ మిలిటెంట్లను ఏరిపారేయడానికి మిలటరీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ దేశ భద్రతకు సవాలు విసురుతున్న మిలిటెంట్లను సమూలంగా నిర్మూలించడమే ఆశయంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు.

తమ పదాతి దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే మిగిలి ఉందని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ చెప్పారు. గ్రౌండ్‌ ఆపరేషన్‌ కోసం 3.60 లక్షల మంది రిజర్వ్‌ సైనికులను ఇజ్రాయెల్‌ సిద్ధం చేసింది. ఇజ్రాయెల్‌–గాజా సరిహద్దుల్లోని యూదుల కాలనీలను ఖాళీ చేయించింది.

యూదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూతల దాడుల వల్ల గాజాలో మరణాలు భారీగా పెరుగుతాయని, సామాన్య ప్రజలు బలైపోతారని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌ పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. 
సిరియా ఎయిర్‌పోర్టులపై ఇజ్రాయెల్‌ దాడులు 

సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్‌ సైన్యం గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. రాజధాని డమాస్కస్‌తోపాటు అలెప్పీలోని ఎయిర్‌పోర్టులపై ఈ దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హమాస్‌కు సిరియా అండగా నిలుస్తున్న సంగతి విదితమే. సిరియా భూభాగం నుంచి కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు జరుగుతున్నాయి. సిరియాకు చేరుకోవాల్సిన ఇరాన్‌ విమానాన్ని ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా టెహ్రాన్‌కు మళ్లించారు. ఈ విమానంలో ఇరాన్‌ దౌత్యవేత్తలు ఉన్నట్లు సమాచారం. 

బందీలను విడుదల చేస్తేనే..
40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న గాజాలో 20 లక్షల మందికిగా జనం నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాకు ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్‌ సరఫరాను ఇజ్రాయెల్‌ ఇప్పటికే పూర్తిగా నిలిపివేసింది. కరెంటు లేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి.

హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరులను విడుదల చేయాలని ఇజ్రాయెల్‌ డిమాండ్‌ చేస్తోంది. బందీలను విడుదల చేసేంత వరకు గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ మంత్రి కాట్జ్‌ గురువారం హెచ్చరించారు. బందీలంతా విడుదలై, క్షేమంగా ఇళ్లకు చేరుకున్న తర్వాతే గాజాకు ఆహారం, నీరు, కరెంటు అందుతాయని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. మిలిటెంట్ల చేతిలో 150 మందికిపైగా బందీలు ఉన్నట్లు తెలుస్తోంది.  

హమాస్‌ను నలిపేస్తాం: నెతన్యాహూ 
పాలస్తీనా సాయుధ తిరుగుబాటు సంస్థ ‘హమాస్‌’ను నలిపి పారేస్తామని, పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ప్రతినబూనారు. తమ దేశంపై దాడి చేసి, ప్రజల ప్రాణాలను బలిగొన్న హమాస్‌పై ఆయన నిప్పులు చెరిగారు. హమాస్‌లోని ప్రతి సభ్యుడికి ఇక చావే గతి అని తేలి్చచెప్పారు. నెతన్యాహూ బుధవారం రాత్రి టీవీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఇజ్రాయెల్‌లో శనివారం హమాస్‌ మిలిటెంట్లు సాగించిన రాక్షసకాండను వివరించారు.  అంతకుముందు ఆయనతో ఇజ్రాయెల్‌ ప్రధాన ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్‌ సమావేశమయ్యారు. హమాస్‌పై యుద్ధాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలుగా వార్‌–టైమ్‌ కేబినెట్‌ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఈ కేబినెట్‌కి నెతన్యాహూ నేతృత్వం వహిస్తారు.   

అండగా ఉంటాం: బ్లింకెన్‌
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ గురువారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తనను తాను కాపాడుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందన్నారు. బ్లింకెన్‌ శుక్రవారం పాలస్తీనా అధినేత మహమ్మద్‌ అబ్బాస్, జోర్డాన్‌ రాజు అబ్దుల్లా–2తో సమావేశం కానున్నారు. పాలస్తీనియన్లకు చట్టబద్ధమైన ఆకాంక్షలు ఉన్నాయని బ్లింకెన్‌  వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top