ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగింపు: నెతన్యాహు | Iran's Supreme Leader a Big Remark by Netanyahu | Sakshi
Sakshi News home page

ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగింపు: నెతన్యాహు

Jun 17 2025 7:25 AM | Updated on Jun 17 2025 9:37 AM

Iran's Supreme Leader a Big Remark by Netanyahu

జరూసలెం: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు. ఖమేనీని  హత్య చేసేందుకు వేసిన ప్లాన్‌ను ట్రంప్ వ్యతిరేకించారంటూ అమెరికా అధికారులు ధ్రువీకరించిన  అనంతరం నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలూ క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం విరుచుకుపడుతున్నాయి. ప్రపంచం ఈ ఘర్షణలను నిశితంగా గమనిస్తోంది.  ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నాల్గవ రోజుకు చేరుకుంది. పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు  జరుగుతున్నాయని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.  ఈ  నేపధ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులు అప్రమత్తంగా మెలగాలని హెచ్చరికలు జారీ చేశాయి.

కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఒక రహస్య బంకర్‌కు తరలించారని సమాచారం. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ)ఆయనకు భద్రత కల్పిస్తున్నది. అయతుల్లా సురక్షితంగా ఉన్నారని, దేశపు రక్షణ చర్యలను అనుక్షణం పరిశీలిస్తూ, తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. కాగా ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్‌ను ట్రంప్  వ్యతిరేకించారంటూ రాయిటర్స్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: బైక్‌పై యువజంట వికృత చేష్టలు.. రూ. 53,500 జరిమానా

Advertisement
 
Advertisement
Advertisement