అశాంతి, ఆందోళనలు ఒకవైపు.. యుద్ధం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి బెదిరింపులు.. వెరసి ఇరాన్ ప్రభుత్వం కకలావికలం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ను ఆశ్రయించే ప్రయత్నం చేస్తోంది. ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు భారతే అండగా ఉంటుందని ఇరాన్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ స్వయంగా ఎక్స్ లో బుధవారం పోస్టు చేశారు. ఆ వెంటనే ఇరాన్‌లోని భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలంటూ విదేశాంగ శాఖ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం..!
అయితే.. తమ మధ్య జరిగిన సంభాషణ వివరాలను జైశంకర్ పంచుకోలేదు. ఇరాన్‌లో పరిస్థితులపై చర్చించినట్లు మాత్రం వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ ద్వారా ఇరాన్ ఇప్పుడు భారత్ మద్ధతు కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే అంశంపై మంగళవారం కూడా మంత్రి జైశంకర్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్(ఐఓఆర్ఏ) సెక్రటరీ జనరల్ సంజీవ్ రంజన్‌తో సమావేశమయ్యారు. ఐఓఆర్ఏ సభ్య దేశాల మధ్య సహకారానికి సంబంధించిన కీలక రంగాలను సమీక్షించారు. ప్రభుత్వాలు, వ్యాపారాలు, విద్యాసంస్థలకు సంబంధించిన సంబంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.


