భగ్గుమన్న పశ్చిమాసియా  | Iran targets Israel with missiles for first time since April ceasefire | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న పశ్చిమాసియా 

Jun 9 2026 5:39 AM | Updated on Jun 9 2026 5:39 AM

Iran targets Israel with missiles for first time since April ceasefire

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ సైన్యం క్షిపణి దాడి 

ఇరాన్‌ పెట్రోకెమికల్‌ ఫ్యాక్టరీపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌  

దుబాయ్‌: పశ్చిమాసియా మళ్లీ ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్‌ మరోసారి పరస్పర దాడులకు దిగాయి. రెండు నెలల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఇదే మొదటిసారి. ఇరాన్‌ సోమవారం ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. మధ్య, పశ్చిమ ఇరాన్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి దిగింది. 

రాజధాని టెహ్రాన్‌తోపాటు చుట్టుపక్కల నగరాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్‌ అధికారిక టీవీ చానల్‌ వెల్లడించింది. రాజధానిలో ఇమామ్‌ ఖమేనీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో ఎయిర్‌స్పేస్‌ను ఇరాన్‌ మూసివేసింది. మాషహర్‌ సిటీలోని ఇరాన్‌ పెట్రోకెమికల్‌ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్‌ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ నిర్ధారించింది. బాలిస్టిక్‌ మిస్సైళ్ల పరికరాలు తయారుచేస్తున్న ఈ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మిస్సైల్‌ లాంచర్లను కూడా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్‌ క్షిపణి దాడికి ప్రతిస్పందనగానే తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ తేల్చిచెప్పింది.  

ఉద్రిక్తతలకు అమెరికాయే కారణం: ఇరాన్‌  
తొలుత లెబనాన్‌ రాజధాని బీరూట్‌ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడి చేయగా, ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. ప్రతీకారం తప్పదని ఆదివారం హెచ్చరించింది. అనుకున్నట్లుగానే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ప్రధానంగా సెంట్రల్‌ ఇజ్రాయెల్‌లో దాడులు జరిగాయి. రెండు సైనిక స్థావరాలను టార్గెట్‌ చేసినట్లు ఇరాన్‌ ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఇరాన్‌ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తాజా ఉద్రిక్తతలకు ముమ్మాటికీ అమెరికా కారణమని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘే ఆరోపించారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్‌ రెచ్చిపోతోందని మండిపడ్డారు.

 ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉన్నందున దాడులు నిలిపివేస్తున్నట్లు కొన్ని గంటల తర్వాత ఇరాన్‌ సైన్యం ప్రకటించింది. ఇరాన్‌ క్షిపణి దాడులను నిలిపివేస్తే ఇజ్రాయెల్‌ సైతం వెనక్కి తగ్గుతుందని ఇరాన్‌కు అమెరికా సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ అండదండలున్న నౌకలపై దాడులు చేస్తామని యెమెన్‌ హౌతీ మిలిటెంట్లు హెచ్చరించారు. హౌతీలకు ఇరాన్‌ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులను భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సోమవారం సూచించింది. స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది. అలాగే ఆ రెండు దేశాలకు వెళ్లే ప్రణాళిక ఉంటే వాయిదా వేసుకోవాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement