టెహ్రాన్ : ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ‘మాకు అణ్వాయుధాలు అవసరం లేదు. అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నాం. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటాం’అని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం..నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ తన యురేనియం నిల్వలను ఒప్పందం ప్రకారం అమెరికాకు ఇవ్వడానికి సిద్ధమైంది.

భారత్‌లోని వారణాసిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ.. ‘అణ్వాయుధాలు ఇస్లాంలో హరామ్ (నిషిద్ధం). ముప్పై ఏళ్ల క్రితమే ఇరాన్ వాటిని వద్దని ప్రకటించింది. సుప్రీం లీడర్ ఇచ్చిన ఫత్వా ప్రకారం అవి మతపరంగా నిషిద్ధం’ అని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ‘న్యూక్లియర్ డస్ట్’ అని పేర్కొంటూ, ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం తమ ప్రధాన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఇరాన్ నాయకులతో సమావేశమై, పశ్చిమ ఆసియాలో శాంతి ప్రయత్నాలపై చర్చించారు. అమెరికా,ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు కొనసాగుతున్నాయి.


