ఇరాన్ కల్లోలంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా స్పందించారు. నిరసనకారులను ఉరి తీస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో.. అక్కడి నిరసనకారులకు సాయం అందించే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు తమ దేశంలో అలజడిపై ఇరాన్ సైతం సంచలన ఆరోపణలకు దిగింది.
అరెస్టైన నిరసనకారుల్లో ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆందోళనలు కొనసాగితే.. మరికొందరికి అదే పరిస్థితి తప్పదంటూ ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ Truth Socialలో స్పందించారు. అలాంటిదే జరిగితే అమెరికా ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ‘‘నిరసనలు కొనసాగించండి.. సహాయం వస్తోంది’’ అని ఇరానీయులకు పిలుపునిచ్చారు. అయితే ఆ సహాయం ఏ రూపంలో ఉంటుందో మాత్రం ట్రంప్ వివరించలేదు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. వేలాది మంది మరణించి ఉండవచ్చని మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్, కాల్పులు, అరెస్టులు, మరణశిక్షలు వంటి చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకారం.. ఇప్పటివరకు 734 మంది మరణించారు. కానీ అసలు సంఖ్య వేలల్లో ఉండవచ్చని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా భారీగానే ఉన్నారని చెబుతున్నాయి. అమెరికా ఆధారిత హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం ఇప్పటివరకు 2,403 మంది నిరసనకారులు మరణించగా.. ఇందులో 12 మంది మైనర్లు ఉన్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 18,137 మందిని అరెస్టు చేశారు. అయితే..
ఇరాన్‌కు చెందిన ఓ టెలివిజన్ సంస్థ వేలమంది శవాలుగా మారిపోయారంటూ కథనం ఇవ్వడం సంచలనాత్మకంగా మారింది. అయితే.. ఆందోళనకారుల మరణాల సంఖ్యను నిర్ధారించని ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా బలగాల మరణాలను మాత్రం అమరవీరులుగా ప్రకటించి.. పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహిస్తోంది.
సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ల హస్తం ఉందని చెబుతూ.. కౌంటర్ వార్నింగులు ఇస్తున్నారు. ట్రంపే ఈ హత్యలకు కారణమంటూ తీవ్ర విమర్శలు చేస్తూ టెహ్రాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో రాజకీయ అస్థిరతను ట్రంప్ ప్రొత్సహిస్తున్నారని.. ఇది సార్వభౌమత్వానికి ముప్పు అని యూఎన్‌లో ఇరాన్ రాయబారి వ్యాఖ్యానించారు. జరగబోయే పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్‌లు సమిష్టిగా బాధ్యత వహించాల్సిందేనన్నారాయన. అయితే ఒకవైపు అణచివేత ద్వారా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే.. ప్రజల నుంచి తమకు మద్దతు ఉందని చూపేలా ర్యాలీలను ఖమేనీ ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది కూడా.
అయితే.. నిరసనకారులపై కఠిన చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి దారితీస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సహా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించే ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఓ అడుగు ముందుకేసి ఖమేనీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఖమేనీ ప్రభుత్వ పతనం ఖాయమైనట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే.. విశ్లేషకులు మాత్రం ఇరాన్ పాలన తక్షణమే కూలిపోతుందని చెప్పడం తొందరపాటు అవుతుందని, అణచివేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు.


