
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం ముందుభాగం బాగా దెబ్బతింది కూడా. అయితే ఆ సమయంలో అప్రమత్తమైన పైలట్.. పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట!.
బుధవారం సాయంత్రం 227 మందితో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఇండిగో విమానం బయల్దేరింది. ఈదురు గాలులు, వడగండ్ల కారణంగా అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ భయపడిపోయారు. ఆ టైంలో అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సంకేతాలు పంపించారు. మరోవైపు..
ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట. అందుకోసం లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు. అయితే, ఇండిగో అభ్యర్థనను లాహోర్ ఏటీసీ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో చేసేది లేక చివరకు.. శ్రీనగర్‌లోనే విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భారత్‌కు చెందిన విమానయాన సంస్థలకూ పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇవాళ్టితో(మే 23) ఆ గడువు ముగియనుంది. తాజాగా మరోసారి దానిని పొడిగించే యోచనలో పాక్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఒకేసారి.. ఒక నెల కంటే ఎక్కువ కాలం ఆంక్షలు విధించేందుకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) నిబంధనలు అనుమతించవు.
ఇదీ చదవండి: పాక్ ఆర్మీ అధికారి బలుపు కామెంట్స్