
కౌలాలంపూర్: నేటి సమాజంలో మంటగలుస్తున్న మానవత్వానికి మచ్చుతునక ఈ ఉదంతం. జూలై 5న మలేషియాలోని నెగెరి సెంబిలాన్ రాష్ట్రంలోని టంపిన్ పట్టణంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భారతీయ కుటుంబం వివాహ వేడుకను నిర్వహిస్తుండగా, అదే వీధిలో చైనా కుటుంబం 94 ఏళ్ల మహిళకు అంత్యక్రియలు నిర్వహించింది.
చైనా కుటుంబానికి చెందిన వాంగ్ అనే రాజకీయ నాయకుడు తన తల్లి మరణాన్ని ‘జాయ్‌ఫుల్ ఫ్యూనరల్’గా పేర్కొన్నారు. అంటే, వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం చైనా సంస్కృతిలో శుభంగా భావిస్తారు. అయితే, తన తల్లి మరణంతో వాంగ్ భారతీయ కుటుంబాన్ని సంప్రదించారు. ‘రాత్రి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు ఉండవు. మీరు మీ వేడుకను కొనసాగించవచ్చు అని వారికి భరోసా ఇచ్చారు. దీంతో భారతీయ కుటుంబం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించింది. సంగీతాన్ని తగ్గించి, అతిథులను అంత్యక్రియల ప్రదేశానికి దూరంగా వాహనాలు పార్క్ చేయమని సూచించింది.
ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇది నిజమైన మలేషియన్ స్పిరిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. సాంస్కృతిక భిన్నత్వం ఉన్నా.. పరస్పర గౌరవం, సానుభూతి ఎలా మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయో ఇది ఒక అద్భుత ఉదాహరణగా నిలిచిందని కామెంట్లు చేస్తున్నారు.