
భారతదేశపు వ్యోమగామి.. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 👨🚀 మరో అదరుదైన ఫీట్ సాధించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని ప్రసిద్ధ కుపోలా విండో వద్ద నుంచి భూమిని వీక్షిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది.
నాసా-ఇస్రో జాయింట్ మిషన్ యాక్సియమ్ మిషన్ 4లో భాగంగా శుభాంశు శుక్లా ISS చేరుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్రకెక్కారు. ఈ మిషన్‌లో భాగంగా.. శుక్లా కమాండర్ పెగ్గీ విట్సన్, స్లావోస్ ఉజ్నాన్స్కీ, టిబోర్ కాపులతో కలిసి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. మైజెనెసిస్, స్ప్రౌట్స్ ప్రాజెక్ట్, మైక్రో ఆల్గీ ప్రయోగాలు వంటి అనేక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొంటున్నారు. తాజాగా..

ఐఎస్‌ఎస్‌లోని కుపోలా నుంచి ఆయన చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. కుపోలా మాడ్యూల్ అనేది ఐఎస్‌ఎస్‌లోని అత్యంత ప్రత్యేకమైన భాగం. అంతరిక్షం నుంచి భూమిని ప్రత్యక్షంగా చూడటానికి రూపొందించిన ఒక విండో గ్యాలరీలా ఉంటుంది.భూమి, నక్షత్రాలు, అంతరిక్ష నౌకలు వంటి వాటిని పరిశీలించేందుకు, ఫోటోలు తీయడానికి, రోబోటిక్ ఆర్మ్‌ను నియంత్రించేందుకు ఉపయోగిస్తారు.
ఇది ఏడు విండోలతో కూడిన గుండ్రటి ఆకారంలో ఉంటుంది. ప్యానోరమిక్ వ్యూ (360 డిగ్రీల దృశ్యం) అందించగల సామర్థ్యం ఉంది. దీనిని ఇటలీ అంతరిక్ష సంస్థ (ASI) రూపొందించి, నాసాకి అందించింది. 2010లో ISSకి ఇది జత చేయబడింది.

కుపోలా ద్వారా భూమిని చూడటం అనేది చాలా భావోద్వేగపూరితమైన అనుభవంగా ఉంటుంది. ఈ విండో గుండా తీసిన భూమి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని విండో టు ది వరల్డ్‌గా దీనిని వ్యవహరిస్తారు.
Finally, we have some awesome images of Astro Shubanshu shukla 🇮🇳🧑🏻🚀
Thank you @Axiom_Space for uploading these 📸#Ax4 #ISRO #Shubanshushukla pic.twitter.com/lfwm8PC6OI— ASTROSPACE (@Arslanshaikh_) July 5, 2025
ఇదిలా ఉంటే.. శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌లో పరిశోధనలతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, విద్యార్థులతో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఎలాంటి సరిహద్దులు కనిపించవు, అందులో భారతదేశం ఎంతో విశాలంగా కనిపిస్తుంది అని చెప్పారు. అలాగే.. జూలై 3, 4 తేదీల్లో తిరువనంతపురం, బెంగళూరు, లక్నోలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం.. జులై 10వ తేదీతో శుక్లా బృందం అంతరిక్ష యాత్ర ముగియాల్సి ఉంది.